2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, వరుస సినిమా షూటింగుల వల్ల బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ వారాహి యాత్రను వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా బ్రో సినిమా షూటింగ్ పూర్తి కావడంతో కాస్త బ్రేక్ తీసుకున్న పవన్…వారాహి యాత్రపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ యాత్రపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర మొదలు కాబోతోందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ యాత్ర రూట్ మ్యాప్ ఖరారైందని, తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో వారాహి యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వారాహి యాత్రను పవన్ ప్రారంభిస్తారని నాదెండ్ల వెల్లడించారు. అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడత సాగుతుందని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుందని నాదెండ్ల వెల్లడించారు.
వారాహి యాత్రలో భాగంగా పవన్ వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతారని, ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలిసి ముందుకువెళ్తారని అన్నారు. జనసేన ద్వారా ప్రజలకు భరోసా కల్పించేలా యాత్ర ఉంటుందన్నారు. జనసేన యాత్రతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని,. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా యాత్ర చేస్తామని అన్నారు.