రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలోబస్సు యాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాత్ర కోసం వారాహి పేరుతో పవన్ సిద్ధం చేసుకున్న ప్రత్యేక వాహనంపై కూడా వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కారు. అయితే, ఎట్టకేలకు తెలంగాణ రవాణా శాఖ ఆ వాహనానికి అనుమతులిచ్చింది. దీంతో ఆ వాహనానికి ఈ నెల 24న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పూజలు జరిపించబోతున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
24న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని పవన్ దర్శిస్తారని, వారాహి వాహనానికి సంప్రదాయ పూజ జరుపుతారని ప్రకటించింది.
2009లో ఎన్నికల ప్రచారం సందర్భంగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందని, కొండగట్టు అంజనేయస్వామి కటాక్షంతోనే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని పవన్ నమ్ముతారని ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే, ఈ బస్సు యాత్రను కొండగట్టు ఆలయం నుంచే ప్రారంభించడాన్ని పవన్ శుభసూచకంగా భావిస్తున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది.
ఇక, పూజ ముగిసిన తర్వాత తెలంగాణలో జనసేన ముఖ్యనేతలతో పవన్ భేటీ అవుతారని కూడా తెలిపింది. తెలంగాణలో పార్టీ వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి పవన్ దిశానిర్దేశం చేస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది. దే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన)ను ప్రారంభించాలని పవన్ కల్యాణ్ సంకల్పించినట్టు తెలిపింది.