ఏదో ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే జనసేన అధినేత ప్రజల్లోకి వస్తారని, ఆయనో సీజనల్ పొలిటిషియన్ అని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటికి చెక్ పెట్టేందుకు ప్రజలతో కలిసి సాగేందుకు జనసేనాని ఓ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నరసింహ ఆలయాల మీదుగా అనుష్టు నారసింహ యాత్ర చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ యాత్రతో రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేసింది.
తన మిత్రపక్షమైన బీజేపీ బాటలో సాగాలని పవన్ నిర్ణయించుకున్నారని అందుకే ఇలా ఆలయాల యాత్రకు సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ మతాన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకుని బీజేపీ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కూడా అదే మార్గంలో సాగేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఏపీలో రథాల దగ్గం, విగ్రహాల ధ్వంసం తదితర విషయాలపై బీజేపీ రచ్చ చేస్తూ అధికార వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తన పొలిటికల్ కెరీర్ ఊపందుకోవడం కోసం ఆ దేవుళ్లపై భారం వేసి పవన్ ఈ యాత్రను మొదలెట్టబోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందుకే ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ కొత్త దారి ఎంచుకున్నారని చెబుతున్నారు. ఎన్నికల ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు, ప్రజా పోరాట యాత్రలు కాకుండా ఈ సారి నారసింహ యాత్రలు చేయాలని సంకల్పించారు. కొండగట్టు నుంచి మొదలు పెట్టి తెలుగు రాష్ట్రాల్లోని 30 నరసింహా ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తూ త్వరలోనే యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. దశలవారీగా ఈ యాత్ర ఉంటుందని ఆయా నియోజకవర్గాల లీడర్లతో మాట్లాడతానని కూడా ఆయన చెప్పారు. మరి ఆయన పాదయాత్ర చేస్తారా లేదా బస్సు యాత్ర చేస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
మరోవైపు ఈ యాత్ర ఆధ్యాత్మికంగా సాగుతుందా లేదా రాజకీయాలు కూడా కలుస్తాయా? అన్న విషయంపై కూడా ఇప్పుడు స్పష్టత లేదు. అసలు ఈ యాత్ర ఎజెండా ఏమిటన్నది త్వరలో తెలుస్తుందని అంటున్నారు. ఎజెండా, కార్యచరణ, షెడ్యూల్ వంటి విషయాలపై త్వరలోనే పవన్ క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ రాష్ట్రంలోని సమస్యలపై స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన అసలు ప్రజల్లోకి రావడం లేదని అంటున్నారు. అందుకే ఆయన వ్యూహాత్మకంగా ఈ నారసింహ యాత్ర ఎంచుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.