తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ముందుగా అనుమతినిచ్చి ఆ తర్వాత రోడ్ షో ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎలాగైనా రోడ్ షో జరిపితీరతామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా బలబద్రపురం వద్ద పోలీసులు కూర్చోవడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు.
సాక్షాత్తు పోలీసులే రోడ్డుపై బైఠాయించి కాన్వాయిని అడ్డుకోవడం తొలిసారి చూస్తున్నామని, ఇది వైసీపీ పాలనలో మాత్రమే సాధ్యమని పవన్ విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారని, ఒక పార్టీ అధినేతగా ప్రజల్లో పర్యటించేందుకు ఆయనకు హక్కు ఉందని పవన్ అన్నారు. అటువంటి చంద్రబాబును ఎలా అడ్డుకుంటారని పవన్ ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు రోడ్డుపై ప్రజలు రాస్తారోకో చేస్తారని, కానీ విధినిర్వహణలో ఉన్న పోలీసులే ఇలా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అదే సమయంలో వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పోలీసుల నిస్సహాయతపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో లైట్లు ఆపేశారని, హోటల్లో నిర్బంధించారని, ఇప్పటంలో కూడా అడ్డుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ప్రభుత్వానికి ఉలుకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. రాజ్యాంగ విలువలపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వంటి పదాలకు అర్థం ఈ ప్రభుత్వానికి తెలియదని మండిపడ్డారు. చంద్రబాబును అడ్డుకున్న తీరు ఈ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం అని విమర్శించారు.