జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఒకటా రెండా మూడా? ఎన్ని నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది? అని కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నామనే టాక్ మాత్రమే వినిపిస్తోంది. అయితే.. తాజాగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని పవన్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
సదరు నియోజకవర్గంలో వరుస భేటీలు నిర్వహిస్తుండడం.. మూడు రోజులుఅక్కడే బస చేసి మరీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, జనసేన నాయకులను ఎంగేజ్ చేయడం వంటివి చూస్తే.. ఆ నియోజకవర్గం నుంచే పవన్ పోటీ చేయడం ఖాయమని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే కాకినాడ సిటీ నియోజకవర్గం అని చెబుతున్నారు. దీనికి ఎంచుకోవడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయని కూడా నాయకులు చెబుతున్నారు.
ఒకటి.. కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. అదే సమయంలో మెగా అభిమానులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్.. ఇక్కడ నుంచిపోటీ చేయడం ద్వారా గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని నిశ్చయించుకున్నట్టు చెబుతున్నారు. మరోవైపు.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై గతంలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కూడా కొనసాగింది.
వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి ఎలా గెలుస్తారో చూద్దామంటూ.. కొన్నాళ్ల కిందట పవన్ కాకినాడలో నిర్వ హించిన సభలో ప్రకటించారు. ఇక ద్వారంపూడి కూడా.. పవన్ కు దమ్ముంటే..కాకినాడ సిటీ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ రువ్వారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పవన్కళ్యాణ్.. కాకినాడ సిటీలోనే మూడు రోజులపాటుబస చేసి..పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి తొలి రోజు గురువారం 50 మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు నేతలతో ఆయన అంతర్గత సమావేశం నిర్వహించారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ కాకినాడ సిటీ నియోజకవర్గంనుంచి పోటీ ఖాయమనే చర్చ సాగుతుండడం గమనార్హం. మరోవైపు.. తిరుపతి నుంచి పవన్పోటీ చేసే అవకాశం ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ కాకినాడ సిటీతోపాటు తిరుపతి నుంచి కూడా తన అదృష్టాన్ని పరిశీలించుకునే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు.కాగా, గత ఎన్నికల్లో పవన్.. గాజువాక(విశాఖ జిల్లా), భీమవరం(ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా)ల నుంచిపోటీ చేశారు. అయితే.. రెండు చోట్లా ఆయన ఓడిపోయారు.