శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న వైనం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు తిరుపతి ఎస్పీకి అంజూ యాదవ్ పై పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. అనంతరం తిరుపతి నుంచి తిరిగి వెళుతూ రేణిగుంట విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శాంతియుత నిరసన తెలపడం భారత రాజ్యాంగం తన పౌరులకు ప్రసాదించిన హక్కు అని, ఆ హక్కును శ్రీకాళహస్తి సీఐ కాలరాశారని పవన్ మండిపడ్డారు. సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు జరిగితే నిలదీసే హక్కు ప్రజలకుంటుందని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తోన్న జనసేన నాయకులు, కార్యకర్తలను కొట్టిన విషయాన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుందని పవన్ చెప్పారు.
జనసేన నేతలు, కార్యకర్తలు ఎల్లపుడూ క్రమశిక్షణతో ఉంటారని, అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ప్రవర్తిస్తారని చెప్పారు. అదే తరహాలో శ్రీకాళహస్తిలో ధర్నా చేస్తోంటే సీఐ అంజూ యాదవ్ తమ కార్యకర్తను కొట్టారని ఆరోపించారు. మచిలీపట్నంలో లక్షలదిమంది జనసైనికులతో కార్యక్రమం నిర్వహించామని, ఎక్కడా క్రమశిక్షణను ఉల్లంఘించలేదని పవన్ చెప్పారు. పోలీసులకు ఇబ్బంది కలిగించకుండా తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తాము పోలీస్ శాఖకు సహకరిస్తున్నామని తెలిపారు.
అయితే, తమకు ఒక స్థాయి వరకే ఓపిక ఉంటుందన్నారు. తాము కచ్చితంగా డిసిప్లిన్‌గా ఉంటామని, పోలీసులు కూడా తమ పరిధిలో ఉండాలని హితవు పలికారు. బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న సిఐ ప్రవర్తన ఖండించదగ్గదని, సాయికి జరిగిన అన్యాయం రేపు ఎవరికైనా జరగొచ్చని చెప్పారు. అటువంటి పోలీసుల ప్రవర్తనను ఖండించాలని పిలుపునిచ్చారు. కాగా, మంగళవారం జరిగే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు రేణిగుంట నుంచి పవన్ బయలు దేరి వెళ్లారు. అయితే, జనసేన నేత సాయి…సీఐని పేరు పెట్టి పిలవడంతోనే ఆమె ఆగ్రహానికి గురై చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది.