తిరుపతి వైసీపీ లోక్సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో, తమ సిట్టింగ్ స్థానంలో అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ…గెలుపుపై ధీమాగా ఉంది. సానుభూతి కోణంలో అధికార పార్టీ అభ్యర్థి గెలుపుపై వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో పనబాక లక్ష్మిని నిలబెడుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ కూడా తిరుపతి బరిలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది. మిత్రపక్షం జనసేన మద్దతుతో సెంటిమెంట్ గా తమకు వర్కవుట్ అవుతుందనుకున్న తిరుపతిలో పాగా వేద్దామని ప్లాన్ వేసింది.
ఉపఎన్నిక షెడ్యూల్ కూడా రాకుండానే దాదాపుగా అభ్యర్థిని కూడా ఖరారు చేసే వరకు వెళ్లారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. దీనికి తోడు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏపీ బీజేపీలోనూ జోష్ పెంచడంతో తిరుపతిలో త్రిముఖ పోటీ ఉంటుందని అనుకున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలంతా హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. తిరుపతిలో బీజేపీ జోరుకు జనసేనాని పవన్ కల్యాణ్ కళ్లెం వేయడమే బీజేపీ నేతల మౌనానికి కారణమని తెలుస్తోంది.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని, అందుకు జనసేన కూడా మద్దతిస్తుందని సోము వీర్రాజు, జీవీఎల్ వంటి నేతలు భావించి ప్రకటనలు కూడా చేశారు. అయితే, తమను సంప్రదించకుండానే బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జనసేనాని పవన్ కు నచ్చలేదట. తిరుపతిలో జనసేన అభ్యర్ధిని బరిలో దించాలని పవన్ అనుకుంటున్న తరుణంలో బీజేపీ నేతలు తమ అభ్యర్థిని బరిలోకి దించాలనుకోవడం పవన్ కు రుచించలేదట. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా పవన్ తీసుకువెళ్లారట.
పవన్ పంచ్ తో గేర్ మార్చిన బీజేపీ నేతలు…తిరుపతిలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. తిరుపతి అభ్యర్థిని బీజేపీ, జనసేనల సమక్షంలోని ఓ కమిటీ నిర్ణయిస్తుందంటూ చెప్పడం విశేషం. 2019 ఎన్నికల్లో తిరుపతిలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. దీంతో, ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపోటములతో పని లేకుండా బలం పెంచుకుందామనుకున్న బీజేపీ ఆశలకు పవన్ బ్రేకులు వేశారని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. మరి, ఈ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.