ట్రెండ్ క్రియేట్ చేయటంలో జనసేన అధినేత.. పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తర్వాతే ఎవరైనా. సినిమాలైనా.. రాజకీయాలైనా ఆయన తనదైన ముద్రను వేసే విషయంలో మిగిలిన వారి కంటే ముందుంటారు. తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. శ్రీవారి లడ్డూ కల్తీ ఇష్యూలో పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించని రీతిలో ఉందన్న మాట వినిపిస్తోంది.
ఒక పొలిటికల్ పార్టీ అధినేత.. ఒక షాకింగ్ ఉదంతంలో గోవింద మాల వేసుకోవటం.. దానికి ప్రాయశ్చిత్త దీక్ష పేరును పెట్టిన తీరుకు ఇట్టే కనెక్టు అవుతున్నారు. దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు కోట్లాదిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువ. ప్రతి పనికి ముందు కానీ తర్వాత కానీ స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ. అంతేనా.. పెళ్లిళ్లు మొదలుకొని ఏ పెద్ద పని మొదలు పెట్టినా.. పరీక్షలు పాస్ అయినా.. కోరుకున్న చోట కాలేజీ సీటు వచ్చినా.. చివరకు ఎన్ ఆర్ ఐలు తాము ఇండియాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ తిరుమల దర్శనం చేసుకోవటానికి ఇష్టపడుతుంటారు.
అంతలా తెలుగోళ్ల జీవితాల్లో భాగమైన స్వామివారికి అపచారం జరిగిందన్న విషయం బయటకురావటంతో.. స్వామి మాల వేసుకొని.. ప్రాయశ్చిత్త దీక్షగా దానికి పేరు పెట్టుకున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత నుంచి కార్లు.. బైకులు.. వాహనాల మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలుకూ అంటూ రాసుకోవటం ఒక ట్రెండ్ గా మారింది. తాజాగా పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కూడా కొత్త ట్రెండ్ కు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది.
స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ విషయంలో ఇప్పటికే వేదనలోఉన్న భక్తులు ఏం చేయాలి? తమ వంతుగా ఏమైనా చేయాలా? అన్నదానిపై ఆలోచిస్తున్న వేళ.. పవన్ కల్యాణ్ మొదలుపెట్టిన ప్రాయశ్చిత్త దీక్ష పలువురిని ఆకర్షిస్తోంది. పదకొండు రోజుల పాటు మాల వేసుకోవటం.. స్వామి వారిని క్షమించమని కోరటం లాంటివి జరిగిన తప్పును అంతో ఇంతో.. అదేమీ కాకున్నా లేశమాత్రమైనా తగ్గినా ప్రయోజనమే అన్న భావన వ్యక్తమవుతోంది. పవన్ దీక్ష చేపట్టిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున ప్రాయశ్చిత్త దీక్షకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇదో ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. పవన్ ఇమేజ్ ఎంతన్నది ప్రాయశ్చిత్త దీక్ష మరోసారి రుజువు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.