పవన్ కళ్యాణ్ వైసీపీకి వణుకు పుట్టిస్తున్నారు. టీడీపీ జనసేనలకు వైరం పెట్టేందుకు ఇన్నాళ్ల పాటు వైసీపీ పడిన కష్టాన్ని పవన్ బూడిదపాలు చేశారు. ఎంత అవమానించినా, ట్రోల్ చేసినా… వైసీపీ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నట్లు గత రెండు రోజుల్లో అందరికీ అర్థమైపోయింది.
వైసీపీ నుంచి ఏపీని విముక్తి చేయడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని… వైసీపీ ఓడించడానికి ఎవరితో అయినా పొత్తుకు జనసేన సిద్ధంగా ఉందన్న విషయాన్ని పవన్ స్పష్టం చేశారు. నేను సీఎం అవడం ముఖ్యం కాదు, ఏపీని జగన్ నుంచి విడిపించడమే నా లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్… బీఆర్ఎస్ పార్టీపైన, ఎంఐఎం పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బతికేదే కాదన్నారు. పొత్తులు పార్టీని చంపవు బతికిస్తాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో రాజకీయం చేస్తోందంటే కారణం పొత్తులే.. పొత్తులతోనే పార్టీ బలోపేతం అవుతుంది.. చంద్రబాబు మనల్ని మోసం చేస్తే మోసపోతామా..? సలహాలిచ్చే కాపు నేతలు కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ను ఎందుకు నిలదీయరు..? అని పవన్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పవన్ ఎంఐఎం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. 15 నిమిషాలు సమయం ఇస్తే మా ప్రతాపం చూపిస్తామన్న ఎంఐఎంకు కూడా 7 స్థానాలు వచ్చాయి. మనమేమో నిజాయితీగా పోరాడుతూ అన్ని చోట్ల పోటీచేస్తే… ఎంఐఎంలా కాదు కదా.. కనీసం విజయకాంత్ లా కూడా మనల్ని గెలిపించలేదు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.