ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. బిజీ షెడ్యూల్ లో కూడా పవన్ తో పది నిమిషాల పాటు మోడీ ఏకాంతంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులు, తనను ప్రభుత్వం ఇరుకున పెడుతున్న తీరుపై మోడీకి పవన్ వివరించినట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో ఏం జరుగుతోందో తనకు అంతా తెలుసంటూ పవన్ తో మోడీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోడీపై పవన్ ప్రశంసలు కురిపించారు. ట్విటర్ వేదికగా మోడీపై పవన్ చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. ‘‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయి’’ అని పవన్ అన్నారు. మోడీ గారిని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారని, ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి శ్రీ నరేంద్ర మోదీ గారు అని పవన్ కితాబిచ్చారు.
ఇక, తెలుగుతోపాటు హిందీలోనూ ఇవే అర్థం వచ్చేలా పవన్ ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని మోడీని పొగుడుతూ పవన్ పెట్టిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.