జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాష్ట్ర మహిళా కమీషన్ నోటీసులు జారీచేయటం విచిత్రంగానే ఉంది. ఇంతకీ కమీషన్ నోటీసులు ఎందుకు ఇచ్చిందంటే రెండు విషయాల్లో పవన్ను తప్పుపట్టింది.
ఇంతకీ ఆ పాయింట్లు ఏమిటంటే మొదటిదేమో మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతు ‘మీరుకూడా 3 పెళ్ళిళ్ళు కాకపోతే 30 చేసుకోండి ఎవరు వద్దన్నారు’ అని అన్నందుకు. ఇక రెండో పాయింట్ ఏమిటంటే ‘నేను ఒకరికి విడాకులు ఇచ్చి మరొకరిని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను…ఒక పెళ్ళిచేసుకుని 30 మంది స్టెప్నీలను మీలో ఉంచుకున్న వారు లేరా’ ? అని అడిగినందుకట.
ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ మాట్లాడుతు 3 కాకపోతే 30 పెళ్ళిళ్ళు చేసుకోండి ఎవరొద్దన్నారు అని ఏదో సరదాగా అన్నారంతే. 3 పెళ్ళిళ్ళ విషయంలో తనను ఎగతాళి చేస్తున్న వారికి పవన్ కూడా అదే పద్దతిలో సమాధానమిచ్చారు. అంతేకానీ దానర్ధం అందరు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలని కాదు, భరణాలు ఇచ్చి విడాకులతో భార్యలను వదిలించుకోవాలనీ కాదు. తన విషయంలో జరిగింది చెప్పి అంత ఆనందంగా ఉంటే మీరూ చేసుకోండని ఎద్దేవా చేశారంతే.
నిజానికి ఇందులో ప్రత్యేకంగా పవన్ను తప్పుపట్టాల్సిందేమీలేదు. నిజంగానే పవన్ను తప్పుపట్టాల్సుంటే మరి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నట్లు తరచూ పవన్ను తప్పుపడుతున్న వాళ్ళకి కూడా కమీషన్ నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే తనను అనవసరంగా కెలుకుతున్న వాళ్ళకి మాత్రమే పవన్ సమాధానమిచ్చారు.
ఇక రెండోపాయింట్ స్టెప్నీ అన్న పదం ఇపుడు కొత్తగా పవన్ కనుక్కొన్నదీ కాదు, ఉపయోగించిందీకాదు. ఆడవాళ్ళని స్టెప్నీలని అవమానిస్తారా ? అంటు కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఊగిపోవటంలో అర్ధమేలేదు. ఎందుకంటే స్టెప్నీ అన్నపదం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వాడేశారు. దాన్ని జనాలు కూడా వ్యవహారికంలో వాడుతున్నారు. ఆ పదాన్నే ఇపుడు పవన్ వాడారంతే. ఇంతోటిదానికి పవన్ కు కమీషన్ నోటీసులు ఇవ్వటం, క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేయటంలో అర్ధమేలేదు.