దేశంలోని పార్టీల తీరు ఒకలా ఉంటే.. బీజేపీ తీరు మరోలా ఉంటుంది. మా ఇంటికొస్తే ఏం తెస్తావ్? మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావన్న ధోరణి ఆ పార్టీ సొంతం. విషయం ఏదైనా సరే.. లాభం మాత్రం తనకే ఉండాలన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉంటుంది.
ఈ కారణంతోనే.. ఆ పార్టీకి మిత్రుల కొరత ఎక్కువగా ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు మంచి మిత్రుడిగా ఉన్న శివసేనతోనూ అధికారాన్ని పంచుకునే విషయంలో వచ్చిన పేచీలతో.. ఆ పార్టీ కటీఫ్ చెప్పేలా చేసింది. అలాంటి బీజేపీ.. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకోవటం.. మిత్రపక్షంగా వ్యవహరించటం తెలిసిందే.
వాస్తవంగా చూస్తే.. బీజేపీతో పోలిస్తే..ఏపీలో జనసేనకే ఎక్కువ ఇమేజ్ ఉందని చెప్పాలి. ఓటు బ్యాంక్ విషయంలోనూ.. పవన్ కల్యాణ్ తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టేస్తే.. మరింత మెరుగు అవుతుందని చెబుతారు.
ఓటర్లకు రూపాయి కూడా ఇవ్వకూడదన్న ఆయన తీరు.. గత ఎన్నికల్లో రెండుచోట్ల పవన్ ఓటమికి ముఖ్య కారణంగా చెబుతారు. తానే కాదు.. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఓటర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి తాయిలాలు ఇవ్వకూడదన్న విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెబుతారు.
ఈ విషయాన్ని పక్కన పెడితే.. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇవ్వకుండా.. బీజేపీ తన అభ్యర్థిని బరిలో ఉంచేలా పవన్ ను ఒప్పించారు. కారణం ఏమైనా కానీ.. ఆయన అందుకు ఓకే చేశారు. ఈ విషయంలో జనసేన నేతలు సైతం నిరాశకు గురయ్యారని చెబుతారు.
పవన్ త్యాగాల్ని బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించిందా? ఏమో కానీ.. తాజాగా ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల కావటం.. ఆ సందర్భంగా ప్రదర్శించాల్సిన బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవటంపై బీజేపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఎక్కడిదాకానో ఎందుకు? బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ తాజాగా మాట్లాడుతూ.. పవన్ సినిమా విడుదల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం రాజకీయానికి దిగిందని తప్పు పట్టారు.
పలు సినిమా థియేటర్ల వద్ద బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టి.. పవన్ కు అండగా నిలిచాయి. తాజాగా మాట్లాడిన సునీల్ దేవ్ ధర్.. వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేయటాన్ని తప్పు పడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పవన్ కు మాత్రమే కాదు.. పవన్ సినిమాకు కూడా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్య ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే విషయంలో ఎవరి సలహాతో నిర్ణయం తీసుకున్నారో కానీ.. జగన్ సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.