ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతకు ముందు భూముల ధర లక్షల్లో ఉంటే ప్రస్తుతం కోట్లు పలుకుతున్నాయి. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌నే కారణమని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు విశ్లేషిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయగా.. అక్కడి ప్రజలు ఆయనను భారీ మెజార్టీతో గెలిపించారు. దాంతో పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ప్రభుత్వంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీనంతటికీ మూల కారణం పిఠాపురం వాసులు. వారు గెలిపించబట్టే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం ప్రజల రుణాన్ని తీర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. పిఠాపురం రూపు రేఖలు మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
పిఠాపురాన్ని తన సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ఇటీవల 3.52 ఎకరాల భూమిని కొన్నారు. ఆ స్థలంలో సొంత ఇల్లు, పార్టీ ఆఫీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాంతో పిఠాపురంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు రూ. 50 నుంచి 60 లక్షలు ఉండే భూములు ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. పిఠాపురం టౌన్లో రోడ్డు పక్కన భూములు ఎకరం రూ. 2 కోట్లు పలుకుతుంది.
అయినప్పటికీ రియల్ వ్యాపారాలు బేరాలు లేకుండా రైతులు చెప్పిన ధరకు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ఇక ముందు అభివృద్ధి పుంతలు తొక్కుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన వారు అక్కడ భూములు కొనేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తానికి పవన్ మహిమతో తమ భూముల ధరలకు రెక్కలు రావడంతో పిఠాపురం వాసులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.