తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏదో ఒక అంశం మీద రచ్చ జరుగుతూనే ఉంది. పట్టుమని పది రోజులు కూడా ఏ వివాదం లేకుండా సర్కారు సాగిన పరిస్థితి లేదు. దీనికి కారణం… ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు ఆయన పార్టీ నేతలు కూడా కారణమన్నది మర్చిపోకూడదు.
ఎంతగానో ఆరాటపడిన అధికారం చేతికి వచ్చిన వేళ.. దాన్ని నాలుగు కాలాల పాటు నిలుపుకోవటానికి అవకాశాలు ఉన్నప్పటికీ.. ఏపీ ప్రజలు ఎప్పుడూ చూడని సరికొత్త రాజకీయాన్ని చూపించే విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం.. ఏపీలో రాజకీయ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి.
మొదట్లో జగన్ కున్న అధికారంతో విపక్షాలు వెనకడుగు వేయటం.. తర్వాతి కాలంలో ఒత్తిడికి తలొగ్గినప్పటికీ.. విపక్ష నేతలు వరుస పెట్టి టార్గెట్ అవుతున్నారన్న ప్రచారం ఊపందుకోవటం.. పోరాటమే తప్పించి మరో మార్గం లేనట్లుగా డిసైడ్ కావటంతో.. ఏపీ రాజకీయాలు మొత్తం ఘర్షణ చుట్టూ సాగుతోంది. దీంతో.. తిరుగులేని మెజార్టీ ఉన్న వైసీపీ సర్కారు.. అంతే ధీటుగా రియాక్టు అయ్యే విపక్షాలతో తరచూ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి.
జగన్ సర్కారుపై పోరు చేసే చంద్రబాబు అండ్ కోకు.. ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోడు కావటంతో అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ టార్గెట్ చేస్తున్న జగన్ అండ్ కోకు గట్టిగా బదులు ఇవ్వాలన్న పట్టుదలను పవన్ లో పెంచటంలో వైసీపీ నేతలంతా విజయం సాధించారని చెప్పాలి.
తన ఫోకస్ మొత్తం రాజకీయాలకే కాదు సినిమాలకు కూడా అని చెప్పిన జనసేనాని సైతం తన తీరును మార్చుకునేలా చేయటంలో జగన్ అండ్ కో కీలక భూమిక పోషించిందని చెప్పాలి.
దీంతో.. యాక్టివేట్ అయిన జనసేనాని ఎప్పటికప్పుడు భిన్నమైన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నపరిస్థితి. ఏపీలో రహదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం తెలిసిందే.
ఏపీ ప్రజలు నేరుగా కనెక్టు అయ్యే ఈ అంశం మీద డిజిటల్ యుద్దానికి తెర తీశారు పవన్ కల్యాణ్. జులై 15 నాటికి ఏపీలోని రోడ్లను సుందరంగా తయారు చేస్తానన్న జగన్ సర్కారు మాటలకు భిన్నంగా పరిస్థితి ఉండటంతో వినూత్నకార్యక్రమానికి తెర తీశారు పవన్ కల్యాణ్.
ఏపీలోని రోడ్ల దుస్థితిని ప్రజలందరికి తెలియజేసేందుకు.. ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచేందుకు వీలుగా ప్రజల్ని మమేకం చేసేలా ప్రోగ్రాం ప్లాన్ చేశారు. ఈ నెల 15 నుంచి 17 వరకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టాలని.. ఇందులో భాగంగా ప్రజలు తామున్న పరిసరాల్లోని పాడైన రోడ్ల గురించి తెలియజేస్తూ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మొబైల్.. అందులో డేటా.. సోషల్ మీడియా ఖాతాలు ఉన్న నేపథ్యంలో #GoodMorningCMSir ప్రోగ్రాం పేరిట ఏపీ రోడ్ల దుస్థితి ప్రపంచానికి తెలియజేయాలన్నట్లుగా పవన్ ఆలోచనగా చెప్పొచ్చు.
సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం జగన్ చెప్పే మాటలకు.. ఏపీలోని పరిస్థితి గురించి అందరికి తెలిసేలా చేయటమే లక్ష్యంగా పెట్టిన ఈ ప్రోగ్రాం జగన్ సర్కారుకు ఇబ్బందికి గురి చేయటమే కాదు.. ఇమేజ్ డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. జనసేనాని ఇచ్చిన #GoodMorningCMSir పిలుపునకు ఏలాంటి రియాక్షన్ వస్తుందన్నది చూడాలి.
Thaman About AP Roads #GoodMorningCMSir pic.twitter.com/lub7ASSEwT
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) July 15, 2022