రాబోయే ఎన్నికలలో టీడీపీతో కలిసి జనసేన ముందుకు వెళుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడిగా కలిసి పోరాడితేనే జగన్ ను గద్దె దించడం సాధ్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై విమర్శలు దూకుడు పెంచారు పవన్. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ ను ఉద్దేశించి పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? ముఖ్యమంత్రి అయితే ఇష్టం వచ్చినట్లు చేస్తావా? అంటూ పవన్ నిప్పులు చెరిగారు.
జగన్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. నీకు సిగ్గుందా? ఏమైనా దిగి వచ్చావా? శివుడు…. వీరభద్రుడుని ఎలా కొట్టాడో అలా ప్రజలు మిమ్మల్ని కొట్టగలరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారమదంతో తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. జగన్ కు వంతపాడే అధికారులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, పవన్ ఎంత పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. తన సంయమనాన్ని చేతగానితనం అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా గొడవలు చేయనని, కానీ, రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
జగన్ గారు అని సంబోధించామని, దానిని నిలబెట్టుకోలేకపోయారని, బూతులు తిట్టడంతోనే తాము కూడా ఏకవచనంతో పిలవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ విడిపోతే ఏపీలోకి రావడానికి పాస్పోర్ట్ కావాలని వైఎస్ఆర్ అన్నారని, ఇప్పుడు ఏపీలోకి వచ్చేందుకు జగన్ పాస్పోర్ట్ అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లమీద తిరగవద్దు అంటారా? రోడ్డుమీదకి వస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
మీరు మాత్రం మర్డర్లు, రౌడీయిజం చేస్తారని, మమ్మల్ని జాతీయ రహదారిపై తిరగనివ్వమని చెబుతుంటారని మండిపడ్డారు. వైసీపీ రాక్షస పాలనను ఎదిరించి నిలబడడం చిన్న విషయం కాదని, నాలుగు దశాబ్దాల చరిత్ర గలిగిన టీడీపీనే ఇబ్బందిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెడితే భయపడబోమని, ఎన్ని కేసులు పెడతారని పవన్ ప్రశ్నించారు.