హైదరాబాద్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు భేటీ అవుతున్నా రు. దాదాపు మూడు మాసాల తర్వాత.. చంద్రబాబు, పవన్‌లు ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే తొలిసారి. అయితే.. ఇప్పుడు ఏ విషయంపై వారు చర్చించుకుంటారు? ఈ చర్చల పర్యవసానం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. మూడు మసాల కిందట విశాఖలో పవన్ పర్యటించిన సమయంలో ఆయనను హోటల్ నిర్బంధించడం.. తర్వాత పరిణామాల నేపథ్యంలో విజయవాడలో చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు.
ఆ సమయంలోనే అరాచక పాలనపై పోరు చేయాలని నిర్ణయించారు. అయితే.. తర్వాత.. ప్రధాని మోడీ విశాఖకు రావడం.. ఆయనతో పవన్ భేటీ కావడం.. ఈ పరిణామాలతో మళ్లీ టీడీపీ, జనసేనల ప్రస్తావనకు బ్రేక్ పడింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత.. తాజాగా బాబుతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే పవన్ వారాహి వాహనం ద్వారా యాత్రను ప్రారంభించనుండడం.. మరోవైపు.. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యంసంతరించుకుంది.
అదేసమయంలో `జీవో 1` ద్వారా సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు ప్రభుత్వం అడ్డు చెబుతున్న దనే విషయంపైనా.. వీరు చర్చించే అవకాశం ఉంది. ఇక, ప్రధానంగా వచ్చే ఎన్నికలకు రూట్ మ్యాప్‌ను ఇద్దరూ.. ఖరారు చేయనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో బీఆర్ ఎస్ ఏపీలోకి అడుగు పెట్టడం, కాపులను టార్గెట్ చేయడం కూడా.. వీరి చర్చల్లో ప్రదాన అంశంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా అడుగులు వేస్తామని.. పవన్ చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు తో కలిసి వ్యూహం సిద్ధం చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
ఇక, ఎటొచ్చీ.. తేలని వ్యవహారం బీజేపీతో పొత్తు విషయమే. బీజేపీ.. ప్రస్తుతానికి జనసేనతో పొత్తును కొనసాగిస్తున్నా.. టీడీపీతోకలిసి వచ్చే ఎన్నికల్లో అడుగులు వేసే విషయాన్ని ఇంకా తేల్చి చెప్పలేదు. దీంతో బీజేపీని పక్కన పెట్టి.. వీరు ముందుకు సాగుతారా? లేక.. బీజేపీని ఏదో ఒక రకంగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తారా? అనేది కూడా నేటి భేటీలో తేలిపోతుందని సమాచారం. మొత్తానికి ఏపీలో వీరి భేటీ ఉత్కంఠగా మారింది.