ఇప్పటం గ్రామంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. పవన్ ఆ గ్రామంలో పర్యటించే వరకు అక్కడ ఏం జరిగింది అన్న విషయం బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలిసింది లేదు. అయితే, పవన్ ఆ గ్రామంలో పర్యటించి కూల్చివేతకు గురైన ఇళ్లను సందర్శించడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. ఇక బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.
దీంతో, ఇప్పటం ఎపిసోడ్ వ్యవహారం నేపథ్యంలో వైసిపి డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలోనే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పవన్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇడుపులపాయపై హైవే కడతామంటూ పవన్ ఇచ్చిన వార్నింగ్ పై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూల్చిపారదొబ్బడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదు షూటింగ్ కాదు పవన్ కళ్యాణ్ అంటూ అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
ఇక, ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని, రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ప్రహరీ గోడలు మాత్రమే కూల్చారని మంత్రి జోగి రమేష్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటం వెళ్లి అక్కడ గ్రామస్తులను రెచ్చగొట్టాలన్నదే పవన్ పర్యటన ఉద్దేశం అని ఆరోపించారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు అభివృద్ధి పనులను అడ్డుకోవడం తప్ప మరో పని లేదంటూ ఎద్దేవా చేశారు.