విశాఖపట్నంలోని రుషికొండ భూములను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రుషికొండ ఆక్రమణకు గురవుతుందని పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు గుప్పించారు. దీంతో, పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. రిషికొండపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోడి వెధవలు…బోడి ప్రచారం అంటూ ఎద్దేవా చేశారు. విశాఖపట్నాన్ని క్రైమ్ సిటీగా చిత్రీకరించేందుకు పవన్, బాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
అక్కడ నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని, సుప్రీంకోర్టు కంటే పవన్ గొప్పవాడా అని రోజా ప్రశ్నించారు. పవన్ సూపర్ స్టార్ కాదని రీమేక్ స్టార్ అని…పవర్ స్టార్ కాదని ప్యాకేజీ స్టార్ అని సెటైర్లు వేశారు. ప్రభుత్వ భూములలో అంతకు ముందున్న పాత కట్టడాలను తొలగించి, కొత్త కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే పవన్ కు ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు. జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలో చెప్పేందుకు నువ్వు ఎవరు అని పవన్ ను ప్రశ్నించారు. జగన్ కన్ను తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని హెచ్చరించారు. కనీసం ఎమ్మెల్యే కాని పవన్ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తన కరకట్ట ఇంటికి 40 కోట్లు, సీఎం ఆఫీస్ ఫర్నిచర్ కు 10 కోట్లు, హైదరాబాదులో తన నివాసాలకు 50 కోట్లు ఖర్చు చేశారని, మొత్తం 157 కోట్లు దుబారా చేశారని, వాటిపై పవన్ ఎందుకు ప్రశ్నించరని మండిపడ్డారు. పక్క పార్టీల జెండా మోయడానికి పార్టీ పెట్టిన ఏకైక నేత పవన్ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కాదని పనికిమాలిన కళ్యాణ్ అని నిప్పులు చెరిగారు. ఇన్నాళ్లు చిరంజీవి పెద్దమనిషిగా బ్యాలెన్స్ డ్ గా ఉండే వ్యక్తి అని భావించానని, కానీ సడన్ గా జగన్ కు సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ లు ఏపీలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటామని ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు.