ఇన్ని రోజులూ టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటారా? అందుకు బీజేపీ ఒప్పుకుంటుందా? అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్దతుగా పవన్ నిలవడమే పొత్తుకు బలాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు విషయం తెలియగానే పవన్ స్పందించారు. విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే పడుకుని పవన్ హడావుడి చేశారనే అభిప్రాయాలున్నాయి.
ఇక ఏసీబీ కోర్టు బాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత పవన్ స్పందిస్తూ.. సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి తాము సిద్ధమంటూ పేర్కొన్నారు. ఇంత చేశాక ఇక వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అంతే కాకుండా విశాఖపట్నంలో గొడవ జరిగినప్పుడు తనకు బాబు అండగా ఉన్నారని. అందుకే ఇప్పుడు తాను ముందుకు వచ్చానని పవన్ చెప్పారు. భవిష్యత్‌లోనూ బాబుతోనే ఉంటాననే సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.