పార్ట్ టైం పొలిటిషియన్…రాజకీయ స్థిరత్వం, నిలకడలేని ప్రసంగాలిచ్చే నేత, పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేసే నాయకుడు…జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన విమర్శలు ఇవి. వైసీపీ నేతలే కాదు…జనసేన కార్యకర్తల్లో చాలామందికి కూడా ఇవే తరహా అభిప్రాయాలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, పవన్ పార్టీ పెట్టినపుడు ఆయన ప్రసంగాల్లో ఉన్న అయోమయం…తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చేస్తున్న ప్రసంగాల్లోనూ కనిపిస్తోంది.
నేను పాతికేళ్లు రాజకీయాల్లో ఉండాలని వచ్చా…జనసేన కార్యకర్తలు కూడా దానికి మానసికంగా సిద్ధం కండి…సీఎం సీఎం అని పిలవకండి…నాకు అధికారం, పదవులు ముఖ్యం కాదు…రాష్ట్రాభివృద్ధే నా ధ్యేయం…పవన్ చాలా సభల్లో స్వయంగా చెప్పిన మాటలు ఇవి. నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి…సీఎం అయితే రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తా…రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి జనసేన అధికారంలోకి వస్తుంది…నిరుద్యోగ యువతకు తలా 10 లక్షలు ఇస్తుంది…ఇవి కూడా పవన్ చెప్పిన మాటలే.
ఇక, తాజాగా తన ప్రసంగం తీరు, మాటల్లో నిలకడ లేమి మారలేదని పవన్ మరోసారి ప్రూవ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వాసులు తలుచుకుంటే తాను సీఎం అవుతానని పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో అత్యంత చైతన్యవంతమైన జిల్లాల్లో తూ.గో జిల్లా ఒకటని, ఈ జిల్లా వాసులు ఎటు మొగ్గితే రాష్ట్రమంతా అటే మొగ్గు చూపుతుందని పవన్ అనడం విమర్శలకు తావిచ్చింది. తూ.గో జిల్లా వాసులు తనను నమ్మి అండగా నిలబడితే తానే సీఎం అంటూ పవన్ ఊహల్లో తేలిపోవడం చర్చనీయాంశమైంది.
పవన్ తాజా కామెంట్లతో మరోసారి ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ తీరు మారలేదని, ఇలా అయితే పవన్ కు ఓటేయాలో వద్దో కూడా జనానికి క్లారిటీ ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కావాలా వద్దా? అధికారం కావాలా వద్దా? జనసేన గెలవాలా లేక జనసేన వేరే పార్టీకి మద్దతిచ్చి దాన్ని గెలిపించాలా? అన్న క్లారిటీ పవన్ కైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తనపై వైసీపీ విమర్శలే కరెక్ట్ అని పవన్ మరోసారి ప్రూవ్ చేశారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Comments 1