గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభి రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 24 గంటలపాటు పట్టాభిని ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారో కూడా తెలియకుండా టార్చర్ చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పట్టాభి భార్య చందన, టిడిపి నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు ఎట్టకేలకు పట్టాభిని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించి ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచారు.
ఈ క్రమంలోనే పట్టాభికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితోపాటు మరికొందరు టీడీపీ నేతలపై సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. పట్టాభితోపాటు మరికొందరు టిడిపి నేతలు తనకు ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నించారని కనకారావు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కులం పేరుతో తనను దూషించినట్టుగా కూడా ఆ ఫిర్యాదులో సీఐ కనకారావు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ కేసులో A1గా పట్టాభి, A2గా దొంతు చిన్నాలను చేర్చిన పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అయితే, న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని పట్టాభి వెల్లడించారు. తన అరచేతులు, అరికాళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. స్టేషన్లో అడుగుపెట్టేసరికి అంతా చీకటిగా ఉందని, ముసుగు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను వేరే గదిలోకి తీసుకువెళ్లి కొట్టారని ఆరోపించారు.
తనని కొట్టే సమయంలో ముఖానికి టవల్ చుట్టారని, తీవ్రంగా లాఠీలతో కొట్టారని ఆరోపించారు. పట్టాభితోపాటు పోలీసుల వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి రెండు వారాలు రిమాండ్ విధించారు. అంతేకాదు పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు.