ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతే ఉండాలని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘అమరావతి టు అరసవెల్లి’ పేరుతో ‘మహా పాదయాత్ర 2.0’ను రైతులు చేపట్టడంతో వైసీపీ సర్కారు ఇరకాటంలో పడింది. ఈ పాదయాత్ర విజయవంతం అయితే అమరావతి రాజధానికి మద్దతు మరింత పెరుగుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు.
ఈ క్రమంలోనే అసలు ఆ పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా పోలీసు శాఖను అడ్డుపెట్టుకొని నిబంధనలు విధించారు. ఈ పాదయాత్ర వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సాకు చెప్పి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరించారు. దీంతో, రైతులు హైకోర్టు తలుపు తట్టి మరీ ఈ మహా పాదయాత్రకు అనుమతిని సాధించుకున్నారు. ఈ క్రమంలోనే రెట్టించిన ఉత్సాహంతో రైతులు కదంతొక్కుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
పాదయాత్రకు ఎలాగైనా అడ్డంకులు సృష్టించాలని కంకణం కట్టుకున్న వైసీపీ నేతలు ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రజలకు వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేయడం మొదలుబెట్టారు. అయితే, ఆ ప్రచారాన్ని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఎలాగైనా ఆ పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న పోలీసులు తెనాలిలో పాదయాత్రకు బ్రేకులు వేశారు.
తెనాలిలో అమరావతి రైతులను పోలీసులు అడ్డుకోవడం సంచలనం రేపింది. మూడో రోజు పాదయాత్ర తెనాలికి చేరుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పాదయాత్రలోని రూట్ మ్యాప్ ప్రకారం ఐతా నగర్ మీదుగా రైతులు వెళ్లాల్సి ఉంది. కానీ, ఆ మార్గంలో వెళ్తున్న అమరావతి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఐతా నగర్ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని రైతులను నడిరోడ్డు మీద పోలీసులు ఆపేశారు.
అంతేకాదు, రైతులు ఆ దారి గుండా వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పోలీసులు బారికేడ్లను పెట్టారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ ఆ బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అయితే, పోలీసుల ఆదేశాలను తాము పాటిస్తామని అమరావతి పరిరక్షణ సమితి నేత గద్దె తిరుపతి చెప్పారు.
కోర్టు అనుమతులు ధిక్కరించే ఉద్దేశం తమకు లేదని, అందుకే పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో పాదయాత్ర కొనసాగిస్తామని ఆయన చెప్పారు. బస్టాండ్ ప్రాంతం మీదుగా చినరావూరు జంగిడి గూడెం వైపుగా సాయంత్రానికి పెదరావూరు చేరుకుంటామని ఆయన వెల్లడించారు. పోలీసులు రెచ్చగొడుతున్నా సరే సంయమనం పాటిస్తూ శాంతియుత మార్గంలో పాదయాత్రను కొనసాగిస్తున్న అమరావతి రైతులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అరసవెల్లి వరకు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తామని రైతులు చెబుతున్నారు.