వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. చాలా వరకు స్థానిక సంస్థల్లో పార్టీకి బలమైన ఎదురుగాలి వీస్తోంది. తుని వంటి బలమైన స్థానాల్లోనూ.. పట్టుకోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ వంతు ఒంగోలు కు వచ్చింది. ఇక్కడ మునిపిసల్ కార్పరేషన్‌లో వైసీపీ సభ్యులుగా ఉన్న వారు.. జనసేన వైపు చూస్తున్నారు. వారికి, వైసీపీకి మధ్య అనుసంధానం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే, రాజకీయ ట్రబుల్ షూటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలును.. అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి సాధించారు. అయితే.. ఆయన పార్టీ మారడంతోపాటు.. వైసీపీపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ తర్వాత.. కార్పొరేషన్‌పై వైసీపీ పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేయలేదు. పైగా.. ఎవరు పోయినా ఫర్వాలేదన్నట్టు మొదట్లో వ్యవహరించారు. దీంతో బాలినేని వర్గంగా ఉన్న 20 మంది పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. బాలినేని కొన్నాళ్ల కిందటే పార్టీ మారి జనసేన తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నట్టు ఒంగోలులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరంతా బాలినేని అండదండలతో రాజకీయాల్లోకి వచ్చిన వారు కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జనసేనానిలో చేరేందుకు 20 మందికిపైగానే.. రెడీ అయ్యారు. కాగా.. ఈ ప్రయత్నాలు అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కొన్నాళ్లుగా ప్రయత్నించారు.
అందుకే.. గత రెండు మాసాలుగా బాలినేని ప్రయత్నించినా.. వారు ఆగారు. అయితే.. ఇప్పుడు చెవిరెడ్డి కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చింది. దీంతో సుమారు 23 మంది ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. వాస్తవానికి ఒంగోలులో జనసేన కంటే కూడా .. టీడీపీ బలంగానే ఉంది. అయినప్పటికీ.. బాలినేని జనసేనలో ఉండడం.. తనకు కూడా బలమైన వర్గం ఉందని నిరూపించుకునేందుకు ఆయన ప్రయత్నించిన నేపథ్యంలో ఒంగోలు త్వరలోనే జనసేనపరంకానుందని స్పష్టంగా తెలుస్తోంది.