ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్) వ్యవహారంపై కొంతకాలంగా ఏపీలో తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓటీఎస్ అనేది ఓ గొప్ప పథకం అని…దాని వల్ల చాలా ఉపయోగమని ప్రభుత్వం, అధికారులు వాదిస్తున్నారు. అయితే, ఆల్రెడీ పెళ్లైన తన భార్యతో మళ్లీ పెళ్లి చేస్తానన్నట్లు ఈ పథకం ఉందని చాలామంది బాధితులు సెటైర్లు వేస్తున్నారు. దీంతో, ఈ పథకం స్వచ్ఛందమేనని వైసీపీ నేతలు కొత్తవాదనను తెరపైకి తెచ్చారు.
కానీ, అధికారులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు మాత్రం వేరేరకమైన ఆదేశాలిచ్చి పైసా వసూల్ కు టార్గెట్లు పెట్టారు. ఇక, కొందరు అధికారులైతే ఓటీఓస్ డబ్బులు కట్టకుంటే పథకాలు, పెన్షన్ లు నిలిపివేస్తామని సర్క్యులర్ లు, నోటీసులు, ఆడియో క్లిప్ లు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల్లూరు జిల్లాలో ఓటీఎస్ డబ్బులు కట్టలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుమారం రేపుతోంది. ఓటీఎస్ పథకం పెట్టి జగన్ ఓ నిండు ప్రాణం తీశారని విమర్శలు వస్తున్నాయి.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పుకొండారెడ్డి పల్లెకు చెందిన మూల పెద గురవయ్య(70) భార్య లక్ష్మమ్మ, పెద్ద కోడలు భాగ్యమ్మ పేరు మీద గతంలో ఇళ్లు నిర్మించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబం ఓటీఎస్ కింద రూ.20 వేలు చెల్లించాలని సచివాలయ సిబ్బంది, అధికారులు ఒత్తిడి చేశారు. తన దగ్గర డబ్బులు లేవని సంబంధిత వలంటీర్ కు గురవయ్య చెప్పాడు. అయితే, వలంటీర్ డబ్బులు కట్టక తప్పదని చెప్పడంతో సచివాలయానికి వెళ్లాడు.
కానీ, అక్కడ కూడా అధికారులు కట్టాల్సిందేనని చెప్పడంతో…ఆందోళనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురవయ్య మృతి చెందాడు. ఓటీఎస్ పథకం వల్లే తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని గురవయ్య భార్య లక్ష్మమ్మ మీడియా ముందు వాపోయారు. అది తప్ప తన భర్తకు వేరే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని, కుటుంబ సమస్యలు కూడా లేవని ఆమె చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో విమర్శలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.