ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సెగ పెడుతున్నారు. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబును జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏకిపడేస్తున్నారు. ట్విట్టర్ లో #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాదాపు 54 వేలకు పైగా ట్వీట్స్ వచ్చాయంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్ లో ఫైర్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు అంబటి రాంబాబు, జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.,
అసలు ఇంతకీ ఏంటీ గొడవ..?
జగనన్న జపం చేసేందుకు, ప్రత్యర్థులపై పరుష పదజాలంతో విరుచుకుపడేందుకు, మంత్రి పదవి కట్టబెట్టిన విశ్వాసంతోనో అంబటి రాంబాబు ఏదో ఒక వంకతో మీడియాలో కనిపిస్తుంటారు. టీడీపీపై, చంద్రబాబుపై, నారా లోకేష్ పై అడ్డగోలుగా నోరేసుకుని పడిపోతుంటారు. రాజకీయ విమర్శలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరు గానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ పనిగట్టుకుని చంద్రబాబును, నారా లోకేష్ ను కించపరుస్తూ మాట్లాడటం అంబటి రాంబాబుకు అలవాటైపోయింది. ఆ అలవాటులో భాగంగానే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు చంద్రబాబు, నారా లోకేష్ పై విమర్శలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ పేరును తీసుకొచ్చారు.
‘లోకేష్ కాకపోతే ఏ జూనియర్ ఎన్టీఆరో, బోనియర్ ఎన్టీఆరో వస్తే కాస్త ముందుకన్నా నడిచిద్ది’ అని టీడీపీలో ఉన్న కొందరు అనుకుంటున్నారని జూనియర్ ఎన్టీఆర్ గురించి అంబటి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు జూనియర్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. తమ హీరో రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటుంటే అనవసరంగా ఎన్టీఆర్ పేరును లాగి అంబటి నానా యాగీ చేస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు.. అడ్డూఅదుపూ లేకుండా అంబటి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అంబటితో పాటు జగన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు #JaganShouldApologizeJrNTR అనే ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అంబటి చరిత్ర అందరికీ తెలుసని, గతంలో మహిళతో మాట్లాడిన కాల్ రికార్డ్ వీడియోలను జూనియర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అంతటితో కూడా అంబటిపై జూనియర్ ఫ్యాన్స్ కోపం చల్లారలేదు. అంబటి ఫొటోకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంబటి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.