తొందరలో జరగబోయే ఎన్నికల్లో కేసీయార్ కు ఎన్ఆర్ఐలు షాకిచ్చారా ? గ్రౌండ్ లెవల్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ తదితర దేశాల నుండి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. వీళ్ళంతా గడచిన రెండు ఎన్నికల్లో కేసీయార్ కే మద్దతుగా నిలిచారు. మరి మూడోసారి మాత్రం ఎందుకని వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు ?
గడచిన పదేళ్ళుగా తాము విదేశాల్లో నానా అవస్తలు పడుతున్నా ఇక్కడ తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని ఎన్ఆర్ఐలు మండిపోతున్నారట. ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం గాలికొదిలేసినట్లు మండిపోతున్నారు. వివిధ కారణాలతో ఎన్ఆర్ఐలంతా ఇపుడు బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఒక్క వారంరోజులు తాము కష్టపడితే చాలు ప్రభుత్వ వ్యతిరేకతను పెంచవచ్చని వీళ్ళు అనుకుంటున్నారట. మంగళవారం ఎన్ఆర్ఐ సెల్ లోని సభ్యులు సమావేశం కూడా అయినట్లు తెలిసింది.
మొత్తం 119 నియోజకవర్గాల్లోని 32 నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐల ప్రభావం ఎంతోకొంత ఉంటుందని ఒక అంచనా. తాము 24 శాతం ఓట్లను ప్రభావితం చేయగలమని ఎన్ఆర్ఐలు అంచనాలు వేసుకుంటున్నారు. పదేళ్ళ పాలనలో ఎన్ఆరఐ కుటుంబాలకు ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయాలను, నిర్లక్ష్యానికి గురైన విధానాలను ఎన్ఆర్ఐలు నియోజకవర్గాల్లో తిరిగి వివరిస్తున్నారు. గల్ఫ్ బాధితుల కుటుంబాలు ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. కేసీయార్ పోటీచేస్తున్న కామారెడ్డిలో ఎక్కువమంది బాధితులున్నారట.
కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 30 వేల ఓట్లున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తమ ఆస్తులను అధికారపార్టీ నేతలు కబ్జాలు చేస్తున్నట్లు ఆన్ఆర్ఐలు మండిపోతున్నారు. అలాగే ఎన్ఆర్ఐల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక పాలసీలను తీసుకొస్తామని కేసీయార్ చెబుతునే ఉన్నారు కాని ఇంతవరకు ఆచరణలోకి తేలదని మండిపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపిస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళని తెలంగాణాకు తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయటంలేదట. ఇలాంటి అనేక కారణాలతోనే కామారెడ్డి, గజ్వేలులో ఎన్ఆర్ఐ బాధిత కుటుంబాల వాళ్ళు నామినేషన్ వేసినట్లు చెబుతున్నారు. మరి తాజా పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.