తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించుకునే పచ్చ పండగ గా భాసిల్లిన మహానాడును ఈ ఏడాది అమెరికాలోని ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా 27-29 తేదీల్లో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి పార్టీ పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ తీర్మానాలు/ భవిష్యత్తు/పోరాటాలు/ఉద్యమాలు/ కొత్త నేతల పరిచయాలు ఇలా అనేక అంశాలను ఈ సమావేశాల్లో చర్చించి కొత్త తీర్మానాలకు పార్టీ సన్నాహకాలు చేస్తుంది.
అయితే, కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా కూడా ఈ మహానాడును వర్చువల్‌గానే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏపీ లోని ఒంగోలు నిర్వహిస్తున్న మహానాడును రెండు రోజులకే పరిమితం చేశారు. అయినప్పటికీ, అన్ని విషయాలను సమగ్రంగా చర్చించి పార్టీ భవితకు పునాదులు పటిష్టం చేయనున్నారు. ఇదిలావుంటే, ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజుల పాటు మహానాడుకు సంకల్పం చెప్పుకొన్నారు. బోస్టన్లోని బెస్ట్ వెస్ట్రన్ రాయల్ ప్లాజా హోటల్లో ఈ మహానాడు నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్‌గా ఇటీవల నియమితులైన ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఈ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఎంవీఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకుడు మన్నవ సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో బోస్టన్‌లో మహానాడు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు ‘జయరాం కోమటి’ బోస్టన్‌కు చేరుకున్నారు. అతిథులకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, మహానాడులో చర్చించే విషయాలపై ఆయన సమీక్ష చేయనున్నారు. ఏపీలో ఏ విధంగా అయితే ఘనంగా నిర్వహిస్తారో, అంతే ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ‘జయరాం కోమటి’ చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్‌లలో ప్రసారం చేసే ఏర్పాట్లు కూడా చేస్తుండడం విశేషం.