అమెరికాలో తెలుగు దంపతుల నిర్వాకం…రూ.10 కోట్లు ‘వీసా’ మోసం
అమెరికాలో స్థిరపడాలని భారతీయులతోపాటు చాలా దేశాల వారు కలలు కంటుంటారు. ముఖ్యంగా చాలామంది భారతీయులు తమ `డాలర్` డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలనుకొని తహతహలాడుతుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం…ఇలా రకరకాల రంగాల్లో స్థిరపడి తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనుకుంటారు. హెచ్ 1 బీ వీసా సంపాదించి అమెరికా వెళ్లి స్థిరపడాలన్నది చాలామందికి ఓ కల. ఈ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించేవారు కొందరైతే….ఆ కలలు కనేవారిని మోసం చేసి సొమ్ముచేసుకొని తమ కలలను నెరవేర్చుకోవాలనుకునే స్వార్థపరులు మరికొందరు.
హెచ్ 1బీ వీసాలకున్న డిమాండ్ నేపథ్యంలో రూ.10 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ తెలుగువారి ఉదంతం సంచలనం రేపింది. వీసా కంపెనీ పేరుతో తోటి తెలుగు వారిని మోసం చేసిన తెలుగు జంట కథ కలకలం రేపింది. గుట్టు రట్టవడంతో ఈ కిలాడీ దంపతులు ఇపుడు కటకటాలు లెక్కబెడుతున్నారు.
పశ్చిమ గోదావరికి చెందిన ముత్యాల సత్యనారాయణ కొడుకు సునీల్, కోడలు ప్రణీత అమెరికాలో నివాసముంటున్నారు. వీసా కన్సల్టెన్సీ కంపెనీ పేరుతో తెలుగు విద్యార్థులకు వీసాలు ఇప్పిస్తామంటూ ఒకొక్కరి దగ్గరి నుంచి దాదాపు 25 వేల డాలర్లను వసూలు చేశారీ దంపతులు. ఇలా మొత్తం రూ.10 కోట్లు దండుకున్న ఈ కిలాడీ దంపతుల మోసాన్ని అమెరికాలోని బాధిత విద్యార్థులు గ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు.
డబ్బు దండుకున్న తర్వాత ఈ కేటుగాళ్లు యూరప్ చెక్కేశారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో, సునీల్, ప్రణీతలపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, పశ్చిమ గోదావరిలో ఉన్న సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నట్లు ఏపీ పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి దండుకున్న డబ్బును సత్యనారాయణ ఖాతాలోకి సునీల్ బదిలీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో, ఈ వ్యవహారంలో సత్యనారాయణ పాత్రపైనా పోలీసులు విచారణ జరపనున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా, కోటి ఆశలతో అమెరికా వెళ్లిన తెలుగువారిని సాటి తెలుగు వారే మోసం చేయడం చర్చనీయాంశమైంది.