ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆయనను సీఎం జగన్ ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏబీవీని ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్ చేయించిన జగన్…ఆ సస్పెన్షన్ రెండేళ్ల వరకు కొనసాగేలా చూశారు. ఆ తర్వాత తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరినా…పెడ చెవిన పెట్టారు. చివరకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో చేసేదేమీ లేక సస్పెన్షన్ ఎత్తివేశారు.
అయితే, ఏబీవీ చేతిలో తనకు గర్వభంగం కావడంతో జగన్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అక్కడ రిపోర్ట్ చేసినా పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ సర్కార్ మీన మేషాలు లెక్కించింది. అయితే, ఈ వ్యవహారంపై కూడా విమర్శలు రావడంతో ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏబీవీకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ వంటి అనామక పోస్టును కేటాయించి జగన్ మరోసారి తన మోనార్కిజాన్ని చాటుకున్నారని విమర్శలు వచ్చాయి.
అయితే, జగన్ మోనార్కిజం అంతటితో ఆగలేదు. మరోసారి కుంటి సాకులు చెప్పి…పసలేని ఆరోపణలు చేసి ఏబీని పోస్టింగ్ ఇచ్చిన 15 రోజుల్లోపే సస్పెండ్ చేయించారు జగన్. అంటే, మిగిలి ఉన్న తన రెండేళ్ల హయాంలో ఏబీవీ పనిచేయకూడదని జగన్ ఫిక్సయ్యారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై ఏబీవీ గతంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
ఏబీవీపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలన్న కోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఏబీవీ తరఫు న్యాయవాది తెలిపారు. అంతేకాదు, సస్పెన్షన్ లో ఉన్న కాలానికి ఆయనకు వేతనం కూడా ఇవ్వలేదని న్యాయస్థానానికి తెలిపారు. ఈ వాదనలు విన్న తర్వాత ఆ విషయాలపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. మరి, ఏబీవీ విషయంలో జగన్ సర్కార్ ఏమని కౌంటర్ దాఖలు చేస్తుందో వేచి చూడాలి.