మహమ్మారి కరోనాకు చెక్ పెట్టటంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం.. వ్యాక్సిన్ తీసుకోవటం రెండూ ముఖ్యమే. కానీ.. కొందరు మాత్రం ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకోవటానికి అంత ఆసక్తిని చూపించని పరిస్థితి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడే అవకాశం ఉందన్న అంచనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. అందరూ మరింత అప్రమత్తతను పాటించాల్సిన అవసరం ఉంది. దీనికి తగ్గట్లే కొన్ని రాష్ట్రాలు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.
తాజాగా పంజాబ్ రాష్ట్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రెండు వ్యాక్సిన్లు వేసుకోని వారికి జీతాలు ఇవ్వమని ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించింది. రెండు వ్యాక్సిన్లు లేదంటే కనీసం ఒక వ్యాక్సిన్ అయినా తీసుకున్న సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సర్టిఫికేట్లను ఉద్యోగులు అప్ లోడ్ చేసిన తర్వాతే వారికి శాలరీలు ఇస్తామని పేర్కొంది.
నిజానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయటంతో పాటు.. కొత్త వేరియంట్ల తీవ్రత ఉండకూడదంటే.. ఈ తరహా కఠిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. పంజాబ్ బాటలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. నిజానికి పంజాబ్ కంటే హర్యానాలో వ్యాక్సిన్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. వ్యాక్సిన్ వేసుకోక తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు.
రెండు వ్యాక్సిన్లను తీసుకోకుంటే బహిరంగ ప్రదేశాల్లోకి ఎంట్రీ లేదని ఇప్పటికే హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. రెండు టీకాలు తీసుకోని వారిని పెళ్లి మండపాల్లోకి.. హోటళ్లు.. బ్యాంకుల.. మాల్స్.. ప్రభుత్వ ఆఫీసులకు అనుమతించమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. రెండు వ్యాక్సిన్లు వేసుకోని వారిని బస్సు ప్రయాణాలకు కూడా అనుమతించటానికి వీల్లేదని చెబుతున్నారు.
దేశంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్ని అలెర్టు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర సర్కారు క్రిస్మస్.. కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతిని ఇవ్వటం లేదు. గుజరాత్ లో డిసెంబరు 31 వరకు రాత్రి వేళలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇలా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తగిన చర్యల్ని తీసుకుంటున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.