ఈ వేసవి అనుకున్నంత హాట్ హాట్‌గా లేదని తెలుగు సినీ ప్రేక్షకులు చాలా ఫీలవుతున్నారు. ఎప్పుడూ సమ్మర్ సీజన్లో భారీ చిత్రాల సందడి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పెద్ద హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు ఒక్కటీ రిలీజ్ కాలేదు వేసవిలో. దసరా, విరూపాక్ష మాత్రమే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ సందడి చేశాయి. ‘విరూపాక్ష’ తర్వాత అయితే ఏ తెలుగు సినిమా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. గత వారం వచ్చిన డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’ మాత్రం అంచనాలను మించి కలెక్షన్లు తెచ్చింది.
ఇక ఈ వారం మూడు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సై అంటున్నాయి. అందులో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది ‘మేమ్ ఫేమస్’. యూట్యూబ్ షార్ట్స్‌తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్.. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించాడు. ఛాయ్ బిస్కెట్ లాంటి క్రియేటివ్ సంస్థ.. ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కోసం చేసిన వెరైటీ ప్రమోషన్లు కూడా బాగానే కలిసొచ్చాయి. యూత్‌కు ఈ వారం ఫస్ట్ ఛాయిస్ ఈ చిత్రమే. ఇక సీనియర్ నటుడు నరేష్ చాలా ఏళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన ‘మళ్ళీ పెళ్ళి’ మరో ఇంట్రెస్టింగ్ మూవీ. పవిత్ర లోకేష్‌తో నిజ జీవిత బంధమే నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందించినట్లుగా కనిపించడం ఆసక్తి రేపుతోంది.
ఇది రియల్ స్టోరీ కాదన్నా జనం నమ్మే పరిస్థితి లేదు. క్రేజీ ప్రోమోలతో ఈ సినిమా మీద జనాల్లో క్యూరియాసిటీ పెంచగలిగారు. ఈ రెంటికీ తోడు మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘2018’ డబ్బింగ్ వెర్షన్ కూడా ఈ శుక్రవారమే థియేటర్లలోకి దిగుతోంది. ఇప్పటికే సెలబ్రెటీలు, మీడియాకు వేసిన స్పెషల్ షోలకు మంచి స్పందన వచ్చింది. మొత్తంగా ఈ వారం బరిలో ఉన్న మూడు చిత్రాలూ ప్రామిసింగ్‌గానే కనిపిస్తున్నాయి. మంచి బజ్ తెచ్చుకున్నాయి. ఇలా మూడు చిన్న సినిమాలు మంచి క్రేజ్ మధ్య రిలీజ్ కావడం అరుదైన విషయం. మరి ఈ త్రిముఖ పోటీలో విజేతగా నిలిచేదెవరో చూడాలి.