అవును తాజాగా తెలంగాణా, ఏపిలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లే అసలైన ఓటింగా ? కాస్త మార్పు, చేర్పులతో అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి స్ధిరమైన ఓటుబ్యాంకనేదే లేదు. ఏదో జాతీయస్ధాయిలో గాలి కొడితే ఎప్పుడైనా నాలుగు ఎంపిలు, లేకపోతే నాలుగు అసెంబ్లీలు గెలుచుకుంటుంది. గాలి లేనపుడు పోటీచేస్తే 99 శాతం మంది అభ్యర్ధులకు అసలు డిపాజిట్లే రావు.
ఇపుడు జరిగిందిదే. తెలంగాణాలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి, తిరుపతి లోక్ సభకు ఉపఎన్నికలు జరిగాయి. రెండు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పోటీచేశారు.
సాగర్ ఉపఎన్నికలో బీజేపీ 7159 ఓట్లొచ్చాయి. గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భరత్ కు 87,254 ఓట్లు వచ్చాయి. ఇక ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డికి 68714 ఓట్లొచ్చాయి. బీజేపీకి వచ్చింది కేవలం 7159 ఓట్లే అంటే డిపాజిట్ కోల్పోయిందనే చెప్పాలి.
ఇక తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక విషయం చూద్దాం. గెలిచిన వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి 6.04 లక్షల ఓట్లువచ్చాయి. ఓడిపోయిన టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 3.04 లక్షల ఓట్లొచ్చాయి.
ఇక బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు 55,759 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ కూడా కమలంపార్టీకి డిపాజిట్ కోల్పోయింది. అయితే ఇక్కడో చిన్న విషయముంది. అదేమిటంటే బీజేపీ అభ్యర్ధికి వచ్చిన 55,759 ఓట్లలో జనసేన ఓట్లు కూడా కలిసున్నాయి.
నిజానికి 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 16,150 ఓట్లే అసలైన ఓట్లనే అనుకోవాలి. ఇపుడు వచ్చిన 55 వేల ఓట్లలో 16 వేల చిల్లర ఓట్లను తీసేస్తే వచ్చే ఓట్లు జనసేన ఓట్లునే అనుకోవాలి.
అంటే బీజేపీకి ఇపుడు వచ్చిన ఓట్లే అసలైన ఓట్లని అర్ధమవుతోంది. మొత్తానికి రెండు ఉపఎన్నికల్లో పోటీచేసిన బీజేపీ అసలు ఓటింగ్ ఏమిటనే విషయమై జనాలకు స్పష్టత వచ్చేసింది.