ఏపీలో నామినేటెడ్ పదవుల మలివిడత పంపకాలు మొదలయ్యాయి. తాజాగా 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. మొత్తం 38 ఏఏంసీ చైర్మన్ పదవుల్లో టీడీపీకి 31, జనసేనకు 6, బీజేపీకి 1 కేటాయించారని తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్ ల పోస్టుల భర్తీపై ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వందల్లో పోస్టులు ఉంటే..వేల సంఖ్యలో ఆశావహులున్నారు. దీంతో, సీఎం చంద్రబాబు పోస్టుల సర్దుబాటుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మూడు పార్టీలలో నేతలకు సమన్యాయం జరిగేలా పంపకాలు చేపట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి అన్న విషయం మొదలు…ఏ పదవి ఎవరికి అన్న విషయం వరకు తర్జనభర్జనలు పడుతున్నారు.
అయితే, పార్టీ కోసం కష్టపడిన వారికి మాత్రమే ఈ పదవులు దక్కాలని చంద్రబాబు గట్టిగా ఫిక్సయ్యారు. ఆన్ లైన్ విధానంలో ఆయా నేతల పనితీరును నేరుగా సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని స్వయంగా మంత్రి లోకేశ్ చెప్పారు. ద్వితీయ శ్రేణి నాయకుల జాబితా తెప్పించుకున్న చంద్రబాబు..ఎమ్మెల్యేలు పంపిన జాబితాను కూడా పరిశీలించారట. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లను ఎమ్మెల్యే సిఫార్సు చేస్తే వాటిని వెంటనే పక్కన పెడుతున్నారని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్ముకున్న నేతలకు పదవులు ఇచ్చేలాగా ఎమ్మెల్యేలు పేర్లు పంపించాలని చంద్రబాబు చెప్పారట.