మీరు చదివింది కరెక్టే. ఈ కీలక వ్యాఖ్య చేసిందో న్యాయస్థానం. వ్యభిచార గృహానికి వెళ్లిన ఒక విటుడ్ని.. తనిఖీల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించాడో వ్యక్తి. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఇటీవల తీర్పును వెల్లడిస్తూ.. డబ్బులు చెల్లించి విటుడిగా వెళ్లి పట్టుబడ్డ రమేశ్ పై కేసును కొట్టి వేయాలని తీర్పును ఇచ్చారు. ఆసక్తికరంగా మారిన ఈ కేసు వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లాకు చెందిన నగరం పాలెం పోలీసులు వ్యభిచార గృహం మీద దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. 2020లో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై కేసు గుంటూరు లోని మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు (ప్రత్యేక మొబైల్ కోర్టు)లో పెండింగ్ ఉంది. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ సదరు వ్యక్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
వ్యభిచార గృహంపై దాడి చేసినప్పుడు పిటిషనర్ అక్కడ కస్టమర్ గా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సందర్భంలో.. ఇంటిని వ్యభిచార గృహ కార్యకలాపాల కోసం అద్దెకు ఇచ్చే వారిపై కేసు పెట్టి విచారించొచ్చు కానీ.. సొమ్ము చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని విచారించటానికి వీల్లేదని చట్ట నిబంధనలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. వ్యభిచార గృహాలకు వెళ్లిన విటుల పై నమోదు చేసిన కేసుల్ని ఇదే కోర్టు కొట్టి వేసిందన్న విషయాన్ని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గతంలో హైకోర్టు తీర్పుల్ని పరిగణలోకి తీసుకొని తన పిటిషన్ పై ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్ పై దిగువ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యభిచార గృహానికి వెళ్లి డబ్బులు ఇచ్చిన విటుడిపై కేసు నమోదు చేయకూడదన్న విషయాన్ని పేర్కొనటం గమనార్హం. ఈ ఉత్తర్వుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.