రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై తీవ్రంగా స్పందించారు. హద్దులు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజాగా నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎన్నికల షెడ్యూల్, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల విధివిధానాలు వంటి పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు.
అనంతరం.. ఆయా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీర్పు మేరకు .. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఇదేసమయంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇక, ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషనర్‌పై వ్యక్తిగతంగా చేస్తున్న వ్యాఖ్యలను నిమ్మగడ్డ మీడియాకు వివరించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని.. ఇప్పటి వరకు సహించానని చెప్పిన ఆయన.. ఇకపై మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. అయితే.. నిమ్మగడ్డ వ్యాఖ్యలు పరుషంగా లేకపోగా.. ఆయన నవ్వుతూనే అధికార పార్టీ పెద్దలకు చురకలు అంటించడంతోపాటు పదునైన హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
“ఎవరైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. పైగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించేందుకు ముందుకు వచ్చింది. అయితే..కొందరు ప్రభుత్వ పెద్దలు మాత్రం నాపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదు“ అని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా నిమ్మగడ్డను టార్గెట్ చేశారు. చంద్రబాబుతో కుమ్మక్కయి.. ఆయన ఎన్నికలకు వెళ్తున్నారని, ప్రజల కోణంలో వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. ప్రభుత్వం ఎన్నికలను ఆపేయాలని సూచించిందని, కానీ, నిమ్మగడ్డకు మాత్రం ప్రజారోగ్యం కన్నా.. తనకు పదవి ఇచ్చిన చంద్రబాబును కాపాడడమే పరమావధిగా మారిందని విమర్శలు గుప్పించారు.
వాస్తవానికి ఇప్పుడు గ్రామాల స్థాయిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పైగా సీనియర్ నాయకుడు, మంత్రి అయి ఉండి కూడా ఆయనే ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని సొంత పార్టీఆలో నేతలే తప్పుబట్టారు.
ఇక, ఇప్పుడు నిమ్మగడ్డ తీవ్రంగా స్పందించారు. అయితే.. ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే.. నిమ్మగడ్డ ఇలా వ్యాఖ్యలు చేయడం వైసీపీలో సంచలనంగా మారింది. రేపు మళ్లీ సుప్రీం కోర్టుకు ఆయా విషయాలు వివరిస్తే.. ఇబ్బందేనని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైనా నేతలు హద్దుల్లో ఉంటారో ఉండరో చూడాలి.