పుర్రెకో బుద్ధి…జిహ్వకో రుచి…అన్నారు పెద్దలు. ఈ సోషల్ మీడియా జమానాలో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి నానా రకాల తిప్పలు పడుతున్నారు కొందరు. జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లి కలకాలం గుర్తుండిపోవాలన్న ఉద్దేశ్యంతో రకరకాల ఫీట్లు…వాటికోసం పడరాన పాట్లు పడుతుంటారు. వెడ్డింగ్ ప్రీ షూట్ ల కోసం కోట్లు తగలేస్తూ…సముద్రగర్భంలో ఫొటోలతో వైరల్ అవుతున్న జంటల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
ఇక, మన దేశంలో అయితే, బుల్లెట్ బండెక్కి వచ్చేత్తున్నా అంటూ డైరెక్ట్ గా పెళ్లి మండపంలోకే ఎంట్రీ ఇస్తున్న పెళ్లి కూతుళ్ల వీడియోలూ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టంట్ మెన్ తన పెళ్లి సందర్భంగా చేసిన ఓ స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టంట్ మెన్ బుద్ధి పోనివ్వకుండా…తన భార్యతో సహా ఓ డేంజరెస్ స్టంట్ చేసి మరీ తమ కొత్త జీవితాన్ని మొదలెట్టాడీ మహానుభావుడు.
శుభమా అంటూ పెళ్లి చేసుకుంటూ హోమగుండం చుట్టూ తిరగాల్సిన వధూవరులిద్దరూ…వెరైటీగా ఉండాలని ఏకంగా ఒంటికే నిప్పంటించుకున్న వైనం చూసి పెళ్లికి వచ్చినవారంతా అవాక్కయ్యారు. స్టంట్మెన్గా పనిచేసే జేమ్ జెస్సోప్, తన భార్య ఆంబిర్ బాంబిర్ మిషెల్ లు తమ ఒంటికి నిప్పంటించుకొని పరిగెత్తుతూ చేసిన వీడియో షూట్, ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తాము చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ స్టంట్ చేశామని జేమ్ చెబుతున్నాడు.
కానీ, ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆ కొత్త దంపతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. వెరైటీగా వెడ్డింగ్ ఫొటో షూట్ ఉండాలనుకోవడంలో తప్పులేదని, కానీ, ఇలా ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఫొటోషూట్ లు చేయడం అవసరమా అని ఏకిపారేస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా…పెళ్లి పీటల మీద నుంచి పాడెక్కాల్సి వచ్చేదని దుయ్యబడుతున్నారు. సినిమాలలో చేసే స్టంట్స్ కు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారని, కానీ, స్టంట్స్ చేస్తూ చనిపోయిన స్టంట్స్ మెన్ గురించి జేమ్ కు తెలియదా అని మండిపడుతున్నారు.