ప్రగతిభవన్ లో జారి పడిన మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం కావటం.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేయటం తెలిసిందే. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఉరుకులు పరుగులు పెడుతూ.. ప్రభుత్వ రథాన్ని నడిపించే కీలక వ్యక్తుల్లో ఒకరైన కేటీఆర్ కు చాలా కాలం తర్వాత ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకునే పరిస్థితి రావటం తెలిసిందే. పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందు చోటు చేసుకున్న అనూహ్య ప్రమాదంతో ఆయనకు స్వల్ప గాయమే అయినా.. దానికి తీసుకోవాల్సిన విశ్రాంతే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. తన కాలికి జరిగిన గాయం గురించి.. మూడు వారాల విశ్రాంతి గురించి షేర్ చేసిన ఆయన.. విశ్రాంతి వేళ ఓటీటీలో చూడాల్సిన సినిమాలను సజెస్ట్ చేయాలని కోరారు. దీనికి మిశ్రమ స్పందన లభించింది.
పలువురు మంత్రి కేటీఆర్ కోరినట్లే పలు సినిమాల్ని సూచించారు. అయితే.. ఇందులోనూ కొందరు సీరియస్ గా సూచనలా చేస్తే.. మరికొందరు వ్యంగ్యంగా రియాక్ట్ కావటం గమనార్హం.
ఒక నెటిజన్ అయితే ఏకంగా 33 సినిమాలకు సంబంధించి జాబితాను పెట్టారు. అందులో తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళంతో పాటు హిందీ.. ఇంగ్లిషు సినిమాలు ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏమంటే.. అందులో సూచన చేసిన సినిమాల్లో అత్యధికంగా ఒక మోస్తరు సినిమాలే ఉండటం గమనార్హం.
మరోనెటిజన్ అయితే.. ‘ఆచార్య.. వినయ విధేయ రామ.. బ్రహ్మోత్సవం.. రాధేశ్యామ్.. సర్దార్ గబ్బర్ సింగ్.. శక్తి’ సినిమా చూడాలని పేర్కొన్నారు. అయితే.. ఈ సినిమాలన్నీ దారుణ డిజిస్టార్లే కావటం విశేషం.
మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా మంచి..మంచి సినిమాల్ని కూడా కొందరు నెటిజన్లు సూచనలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేటీఆర్ సూచనకు మరికొందరు ఇంకోలా రియాక్టు అయ్యారు.
‘‘2018 సంవత్సరం లో కొట్టుకుపోయిన వంతెన 4 ఏళ్లు అయిన పూర్తి కాలే మి నియోజక వర్గం లో ఇటువంటివి yellareddypet మండలం లోన్ 3 వున్నాయి వీలైతే వీటి సంగతి చూడండి ఓటీటీ సినిమా ముచ్చట్లు తర్వాత’’ అంటూ ఘాటుగా రియాక్టు అయితే.. మరో నెటిజన్.. ‘‘అయ్యా.. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. అయితే మీరు ఇప్పుడు చూడాల్సింది ఓటీటీ సినిమాలు కాదు. 23 వేల మంది మా వీఆర్ఏ ల బతుకులు ఆగం అయ్యి రోడ్డున పడ్డాయి. మా ఆవేదనలు చూడండి ఒకసారి ఇదే సోషల్ మీడియాలో’’ అంటూ పేర్కొన్నారు. మరి.. ఈ సూచనలకు కేటీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.