ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు.. విశాఖపట్నంలో బస చేసేలా భవనాలు వెతకాలంటూ వైసీపీ ప్రభుత్వం బుధవారం రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత ఇచ్చిన జీవో పై నెట్టింట జోరుగానే చర్చ సాగుతోంది. “2014 విభజన చట్టంలో పేర్కొన్న విధంగా.. అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖలో బస చేసేందుకు ఏర్పాటు చేయండి“ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో జీవో విడుదలైన విషయం తెలిసిందే.
అయితే, దీనిలోని అసలు విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఉత్తరాంధ్ర వెనుక బడిన ప్రాంతమే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ విషయం గుర్తించిందా? లేక, 2014లో రూపొందిన విభజన చట్టం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ఉత్తరాంధ్ర ఉద్దరణ పేరిట ప్రభుత్వాన్ని గుండుగుత్తగా విశాఖకు తరలించడం వెనుక ఉద్దేశం ఏంటి? అని నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు.
అంతేకాదు.. సర్కారు చెబుతున్నట్టు ఉత్తరాంధ్ర ఉద్ధరణే ముఖ్యమని భావిస్తే.. ఇన్ని సంవత్సరాల పాలనలో ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా? అని నిలదీస్తున్నవారు కూడా ఉన్నారు. మరికొందరు అయితే.. ఏ ప్రాంతం వెనుకబడి ఉంటే.. ఆ ప్రాంతానికి ప్రభుత్వం , ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వెళ్లి కూర్చుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిపోతుందా? అని నిలదీస్తున్నారు. ఇదే నిజమైతే.. రాష్ట్రంలో వెనుక బడిన ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క ప్రభుత్వం ఏర్పాటు కావాలని మరికొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
వెనుక బడిన ప్రాంతంపై ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తూ.. విశాఖకు పాలనా రాజధానిని(ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లిపోతే అంతేగా) మార్చాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విదేశాల్లో ఉంటున్న మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. వైసీపీ ప్రభుత్వం విశాఖకు తరలి పోవాలని భావిస్తూ.. దీనికి విభజన చట్టం, వెనుక బడిన ప్రాంతం అనే పేర్లు పెట్టుకుంటోందని మెజారిటీ నెటిజన్లు భావిస్తుండడం గమనార్హం.