కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసేందుకు వెళ్లేవారు.. ఆ కష్టాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోతే ఎలా ఉంటుంది? ఇంచుమించు ఇప్పుడు అలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. విస్మయానికి గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే..ఒడిశా (బాలాసోర్) ఘోర ప్రమాద వేళ.. బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిన వైనం తాజాగా వెలుగు చూసింది.
విపత్తులు విరుచుకుపడిన వేళ.. సాయం చేసేందుకు ముందుండే ఈ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాంటి వారిని సైతం.. బాలేశ్వర్ ఘోర ప్రమాదం తీవ్రంగా ప్రభావితం చేసిన పరిస్థితి. దాదాపు 300 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి వేళ ప్రమాదం చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగిన వారు.. దాదాపు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని పని చేశారు. ఇప్పుడు వారు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
అయితే.. ఈ ప్రమాదం వారి మీద చెరగని ముద్ర వేయటమే కాదు.. ఇప్పుడు వారు విచిత్రమైన మానసిక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఒకరికి నీళ్లను చూసినా రక్తంలా అనిపిస్తుంటే.. మరొకరికి తినాలన్న కోరికే చచ్చిపోయిందట. మరికొందరు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారని.. తమ కళ్ల ముందు గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలు.. గుర్తు పట్టలేనంత దారుణంగా ఉన్న వాటిని బయటకు తీసుకొచ్చిన వైనం.. భీకర ద్రశ్యాల్ని చూసిన వారు.. ఇప్పుడు ఒకలాంటి ట్రామాలో ఉన్నట్లు చెబుతున్నారు.
తమ సిబ్బంది మానసిక సమస్యల్ని.. ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయాన్ని తాజాగా ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. ఘటనస్థలానికి వెళ్లి.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడ పరిస్థితుల్ని చూసి చలించిపోయినట్లుగా పేర్కొన్నారు. వారు ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందుల నేపథ్యంలో వారికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేయనున్నట్లుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. విరుచుకుపడే విపత్తుల్లో పని చేసే వారిని సైతం చలించిపోయేలా చేసిన ఈ రైలు ప్రమాదం ఎంత ఘోరమన్నది ఇట్టే తెలుస్తుందని చెప్పాలి.