దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి హవా నడుస్తోందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో అంచనా వేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని, ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని, ఏపీలో చంద్రబాబు మూడో సారి ముఖ్యమంత్రి చాలా సర్వే సంస్థలు ప్రకటించాయి. ఇక, ఏపీలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని చాలా సర్వే సంస్థలు తేల్చేశాయి. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తారీకున జరగోబోయే కౌంటింగ్ పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారి స్పందించారు.
కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. కానీ, కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని, కూటమి నేతలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కొర్రీలు వేయాలని వైసీపీ చూసిందని, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. డిక్లరేషన్ ఫారం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు.
ఉండవల్లి నివాసం నుంచి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలీకాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయి సందర్భ:గా చంద్రబాబు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అని, రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే అని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారతీయులంతా అగ్రస్థానంలో ఉండాలని, అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
“10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి….సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి” అని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.