సాధారణంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన కవరేజ్.. రాజకీయ అంశాలు.. ఆ పార్టీ చేసే కార్యక్రమాలు.. నిర్వహించే ఆందోళనలు.. నిరసనలకు లోకల్ మీడియాతో పాటు.. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ మీడియా ఛానళ్లు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంటాయి. రోటీన్ గా జరిగేది ఇదే. ఎంతో ప్రాధాన్యత తప్పిస్తే.. జాతీయ చానళ్ల (కొందరికి ఈ మాట అంటే కోపం వస్తుంటుంది. జాతీయ చానళ్లు కాదు హిందీ.. ఇంగ్లిషు చానళ్లు అనమంటుంటారు) లో స్పేస్ దొరికేది తక్కువ. అలాంటి వేళలో.. రోటీన్ కు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలను లోకల్ మీడియా లైట్ తీసుకున్న వైనం చర్చనీయాంశమైంది.
షర్మిల తన పాదయాత్ర 3500 కి.మీ. సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం.. అక్కడికి వెళ్లే ముందే.. ఆమె వాహనాన్ని ధ్వంసం చేయటంతో పాటు.. దాన్ని నిప్పు అంటించటం తెలిసిందే. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ తలనొప్పులకు తెర తీసేలా చేసింది. తన వాహనాన్ని ధ్వంసం చేసి.. నిప్పు పెట్టే ప్రయత్నం చేసిన వారిపై షర్మిల సీరియస్ అయ్యారు.
అదే వేరే నాయకుడు అయితే.. అక్కడి నుంచి ముందు బయటకు వచ్చేస్తారు.కానీ.. అక్కడ ఉన్నది షర్మిల కావటంతో ఆమె వెనకడుగు వేయలేదు సరికదా.. నిరసన నిర్వహించారు. ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాట.. పోలీసుల తీరు కారణంగా షర్మిల ముఖం మీద రెండు చోట్ల గాయాలు అయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమెను పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చేశారు.
ఆ తర్వాతి రోజున దాడికి గురైన వాహనం తీసుకొని ఏకంగా ప్రగతి భవన్ వద్ద నిరసన చేపట్టేందుకు వెళ్లిన షర్మిలను అడ్డుకోవటం.. ఆమెను ఎంతసేపు చెప్పినా.. కిందకు దిగేందుకు ససేమిరా అనటంతో ఆమెను..ఆమె ఉన్న వాహనాన్ని కలిపి టోయింగ్ వెహికిల్ తీసుకొచ్చి తరలించారు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత్రి.. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరిని ఈ తీరులో తరలించటం షాకింగ్ గా మారింది. అయితే.. దీనికి సంబంధించిన విజువల్స్.. వార్తలు ప్రాంతీయ మీడియాలో ఇచ్చిన ప్రాధాన్యత అంతంత మాత్రమే.
ఇందుకు భిన్నంగా జాతీయ మడియా మాత్రం షర్మిల ఎపిసోడ్ ను చాలా ప్రాధాన్యతను ఇచ్చింది. పదే పదే జరిగిన ఉదంతంపై జాతీయ స్థాయిలో ప్రముఖ చానళ్లుగా పేరున్న మీడియా సంస్థలు మొత్తం షర్మిల ఎపిసోడ్ ను ప్రత్యేకంగా ఫోకస్ చేయటం జరిగింది.
దీంతో.. షర్మిలను ఆ విధంగా టోయింగ్ వెహికిల్ తో తరలిస్తారా? అంటూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఈ మొత్తంగా చూస్తే.. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రాధాన్యత అంతగా అంచనా వేయని ప్రాంతీయ మీడియా సంస్థలకు భిన్నంగా జాతీయ మీడియా ఇచ్చిన ప్రయారిటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షర్మిల పార్టీ వరకు తెలుగు మీడియాలో ఇచ్చే ప్రాధాన్యతతో పోలిస్తే.. జాతీయ మీడియాలో ఆమెకు ప్రయారిటీ ఇవ్వటం గమనార్హం. తెలుగు మీడియా సంస్థలు గుర్తించని ప్రాధాన్యను జాతీయ మీడియా ఎలా గుర్తించగలిగింది చెప్మా?