హైదరాబాదు జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కనీసం ఎవరి అంచనాలకు కూడా అందనంత సీరియస్ గా తీసుకుంది. అయితే, అందరూ ఇది 15 రోజుల క్రితం మొదలైన హడావుడి, దుబ్బాక తర్వాత వచ్చిన జోష్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అండర్ కరెంట్ గా ఏడాది క్రితమే బీజేపీ ఒక యజ్జంలా మొదలుపెట్టింది.
దుబ్బాక ఓటమితో అలర్ట్ అయిన టీఆర్ఎస్… హైదరాబాదులో ఎక్కువ సమయం ఇస్తే బీజేపీ కి మేలు జరుగుతుంది. మనం అన్నీ ఏర్పాట్లు చేసుకుని తక్కువసమయంతో వెంటనే ఎన్నికలు పెట్టి బీజేపీకి అభ్యర్థులు లేకుండా చేద్దాం. వ్యూహాలకు అవకాశం లేకుండా చేద్దాం అనుకుని తనంతట తాను కేసీఆర్ లోలోపల ప్లాన్ చేసి వారెవ్వా అని సంబరపడ్డారట. కానీ వారికిపుడు అర్థం అవుతున్న విషయం ఏంటంటే… బీజేపీ ఎప్పట్నుంచో జీహెచ్ఎంసీకి సిద్ధంగా ఉంది.
హైదరాబాదు ఎన్నికల్లో బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు పోతోంది. అందుకే ఇంత హడావుడిగా ఎన్నికలు పెట్టినా టీఆర్ఎస్ కంటే ఎక్కువ నామినేషన్లు వేయగలిగింది. ప్రస్తుతం హైదరాబాదులోని ప్రతి డివిజనులో బలమైన అభ్యర్థిని నిలబెట్ట గలిగింది బీజేపీ. బీజేపీ హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే… స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
బీజేపీకి అన్నీ తామే అయిన ఇద్దరు ఇపుడు ప్రచారం చేయడం మామూలు విషయం కాదు. వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉంది. అయితే, తాజాగా మోడీ పర్యటన ఖరారయినట్లు సమాచారం రావడంతో ఒక కీలక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.ఒకే ఒక సభలో 29వ తేదీ ప్రచారంలో చివరి రోజు మోడీ ఇక్కడ ప్రసంగిస్తారు. ఆ సందర్భంగా మోడీ ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారట. అది ఏమై ఉంటుందా అన్న పెద్ద చర్చ జరుగుతోంది.
గతంలో హైదరాబాదుకు ప్రకటించిన ఐటీఐఆర్ గురించి ఏమైనా మాట్లాడతారా? లేదా ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా? లేదా కొత్త పెద్ద పరిశ్రమను ఏదైనా ప్రకటిస్తారా అన్న ఉత్కంఠపూరిత చర్చ మొదలైంది. కొంపదీసి హైదరాబాదును UT చేస్తాం అన్న ప్రకటన చేస్తే అది తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపుతిప్పే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే, మోడీ గత ప్రచార శైలిని చూస్తే అంతపెద్ద ప్రకటన చేయకపోవచ్చు. అది వేరే ప్రమాదాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకనే ఐటీఐఆర్ గురించి మోడీ ఏమైనా చెబుతారేమో అంటున్నారు. అది హైదరాబాదుకు చాలా కీలక విషయం అవుతుంది.