ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. 475 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టింది. భూమి పూజ అనంతరం బహిరంగ సభలో మంత్రి లోకేష్ ప్రసంగించారు.
సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పీ4 విధానానికి రిలయన్స్ యొక్క సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయని, పేదరికాన్ని నిర్మూలించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి రిలయన్స్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ రంగంలో 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టబడితో రిలయన్స్ 500 ప్లాంట్లు పెట్టబోతుందని.. తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్ర సమయంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నానని.. రిలయన్స్ మొదటి సీబీజీ ప్లాంట్ ను కనిగిరిలో ప్రారంభించానని ఈ సందర్భంగా లోకేష్ గుర్తుచేశారు.
2019 నుంచి 2024 వరకూ రాష్ట్రంలో విధ్వంస పాలన నడించిందని, వాటాలు ఇవ్వలేదనే కారణంతో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మంత్రి లోకేష్ వైసీపీపై మండిపడ్డారు. లులూ, అమర్ రాజా, హెచ్ఎస్బిసీ, జాకీ లాంటి అనేక కంపెనీలను బెదిరించి బయటకు పంపారని వివరించారు. గత ఐదేళ్లలో మీరు రాష్ట్రానికి తెచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు గతంలోనే తాను సవాల్ చేశానని.. కానీ అటు వైపు నుంచి ఇంతవరకు సౌండ్ లేదంటూ జగన్ పై లోకేష్ సెటైర్ వేశారు.
ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చిన దమ్మున్న పార్టీ టీడీపీ అని.. గెలిచిన మొదటి రోజు నుంచే ఉద్యోగాల వేట మొదలుపెట్టామని నారా లోకేష్ తెలిపారు. రిలయన్స్, ఎన్టీపీసీ, ఆర్సీలార్ మిట్టల్, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని.. ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు చేసుకున్నామని లోకేష్ వ్యాఖ్యానించారు. పేదరికం లేకుండా చేయాలంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలి.. 5 ఏళ్లలో రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే నా సింగిల్ టార్గెట్ అని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.