కొన్ని కొన్ని ఘటనలు.. చాలా చిత్రంగాను.. విచిత్రంగాను అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. అధికార పార్టీ వైసీపీ ఎక్కడో.. ఎందుకో.. భయపడుతోందనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లా అయిన శ్రీకాకుళంలో పర్యటించేందుకు వచ్చిన టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంది.
ఇక్కడ టీడీపీ నాయకుడి ఇంటిని పలాస మునిసిపల్ అధికారులు ఆక్రమణల పేరుతో కూల్చేశారు. దీనిని నిరసిస్తూ.. టీడీపీ ఆందోళన చేపట్టింది. దీంతో ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకులకు మద్దతు ఇచ్చేందుకు.. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నారా లోకేష్ పలాస వచ్చారు. అయితే.. ఆయనను అడుగడుగునా.. పోలీసులు అడ్డుకున్నారు.
కనీసం పలాసలో అడుగు కూడా పెట్టకుండా చేశా రు. అంతేకాదు.. పలాసలో మీటింగ్ పెట్టేందుకు.. మీడియాతో మాట్లాడేందుకు కూడా వారు అనుమతించలేదు. ఇక, ఆ తర్వాత.. నారా లోకేష్‌ను అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక, కొన్ని గంటల తర్వాత.. ఆయనను బలవంతంగా విశాఖపట్నం తీసుకు వచ్చిన పోలీసులు.. విజయవాడ వెళ్లే విమానాన్ని ఎక్కించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో నారా లోకేష్‌ను అక్కడ కూడా మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్క డకూడా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఇటు టీడీపీ.. అటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం.. నడిచింది. కట్ చేస్తే.. మూడేళ్ల కిందట కూడా ఇలాంటి పరిణామమే మనకు కనిపిస్తుంది.
విశాఖలో పర్యటించేందుకు వచ్చిన.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును కనీసం.. విమానాశ్రయం నుంచి కూడా బయటకు రాకుండా.. వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఆయనను బయటకు రాకుండా.. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి.. అత్యంత కీలక నాటకీయ పరిణామాల మధ్య ఆయనను తిరిగి విజయవాడకు పంపేశారు.
ఇది తీవ్ర వివాదంగా మారడం.. హైకోర్టుకు కూడా చేరడం తెలిసిందే. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ రెండు పరిణామాల మధ్యసాపత్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో చంద్రబాబును, ఇప్పుడు నారా లోకేష్‌ను కూడా ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనీయకుండా.. వైసీపీ రాజకీయాలు చేస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు.
అయితే.. గత ఎన్నికల్లో జగన్ హవాతో ఒకింత పార్టీ వెనుకబడినా.. మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీని పుంజుకోకుండా చేసేందుకు.. వైసీపీ అధిష్టానం .. ఇలా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లు అసలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడుగు పెట్టుకుండా చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు వారు అనుమానిస్తుండడం గమనార్హం.