రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. నిన్నటిదాకా తిట్టుకున్న వారుకూడా అవసరం కోసం కలుసుకున్నవారు ఉన్నారు. నిన్నటి వరకు కలిసి ఉన్నవారు కూడా అవసరం కోసం దూరమైన వారు కూడా ఉన్నారు.
అందుకే రాజకీయాల్లో తరచుగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. కానీ, ఇది ఇతర పార్టీలకు, ఇతరకుటుంబాలకు అన్వయం అవుతుందేమో కానీ.. ఎన్టీఆర్ కుటుంబంలో మాత్రం కాదని అనేవారు చాలా మంది ఉన్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. వారే.. ఎన్టీఆర్ పెద్దల్లుడు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చిన్నల్లుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు.
వీరిద్దరూ.. ఎన్టీఆర్ హయాంలో మంత్రులుగా ఒకే పార్టీలో పనిచేశారు. కానీ, టీడీపీలో తలెత్తిన సంక్షోభం తర్వాత.. ఎవరికివారుగా దూరమయ్యారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి.. అన్నగారు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, ఆతర్వాత.. దగ్గుబాటి చాలా కాలం సైలెంట్ అయ్యారు.
పురందేశ్వరి మాత్రం కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయంగా చంద్రబాబును దగ్గుబాటి తరచుగా కామెంట్లు చేశారు. అంతేకాదు.. చంద్రబాబు పాలనపై విమర్శనాత్మక కోణంలో వెంకటేశ్వరరావు పుస్తకం కూడా రాశారు.ఇక, దగ్గుబాటిని ప్రకాశం జిల్లా పరుచూరులో ఓడించేందుకు.. చంద్రబాబుకూడా శాయశక్తులా కృషి చేశారు.
ఇలా.. చంద్రబాబు వర్సెస్ దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజకీయాలు నిప్పు-ఉప్పుగా మారాయి. ఇక, వీరు కలుసుకునే ప్రసక్తే లేదని రాజకీయ నేతలు కూడా భావించారు. అయితే, అనూహ్యంగా.. హైదరాబాద్లో సీనియర్ ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిసి మాట్లాడుకున్నారు.
రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్న చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు.. చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించాయి. హైదరాబాద్లో నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూతురు వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అలుళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈసందర్భంగా.. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కలిసి ఫొటోలు దిగారు. వెంకటేశ్వరరావు సతీమణి పురంధేశ్వరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ వివాహాన్ని.. చంద్రబాబు తన చేతుల మీదుగా జరిపించారు. ఆ వివాహానికి పురందేశ్వరి ఒక్కరే రాగా.. ఇప్పుడు వెంకటేశ్వరరావును కూడా తీసుకురావడం.. రాజకీయంగా ఏదైనా సంకేతాలు ఇస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి.