ఎన్టీఆర్ ట్రస్టు…ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ ట్రస్టు పేరు తెలియనివారుండరు. రాజకీయాలకతీతంగా, ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా ప్రజాసేవ చేస్తోందీ ట్రస్ట్. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేతృత్వంలో నడుస్తున్న ఈ ట్రస్ట్ పలు రకాల విపత్తుల సమయంలో వేలాది మంది ప్రజలకు ఆపన్న హస్తం అందించింది. ధన, వస్తు, ఆహార సాయం చేసి కష్టకాలంలో ఉన్న వారికి చేయూతనిచ్చింది.
కొద్ది నెలల క్రితం కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలలో 48 మంది వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. వరదలు, ప్రకృతి విపత్తులు, కరోనా వంటి క్లిష్ట సమయాల్లో ఎంతోమందికి ట్రస్టు ద్వారా అన్నదానం చేశారు. అంతేకాదు, కులం, మతం, ప్రాంత కంటే మానవత్వమే గొప్పదని నమ్మే భువనేశ్వరి…కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ ప్రజలకు వైద్య సాయం అందించారు. కరోనా ఆపత్కాలంలో తెలుగు ప్రజల కోసం నిపుణులైన వైద్యులతో ఆన్లైన్లో వైద్యసేవలు అందించారు. అంతేకాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా విభాగం ఆధ్వర్యంలో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు కూడా చేయించిన ఘనత భువనేశ్వరికే దక్కుతుంది. గతంలో కరోనా బాధితుల కోసం 24/ 7 కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు,
ప్రజా సేవ చేయాలనే తపన తన తండ్రి ఎన్టీఆర్ లో ఎప్పుడూ ఉండేదని, అదే స్ఫూర్తితో ఇప్పుడు తాము పనిచేస్తున్నామని భువనేశ్వరి చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలోనే ‘మానవ సేవే మాధవ సేవ’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న భువనేశ్వరి ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కోటప్పకొండ తిరుణాళ్ల సందర్భంగా చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామస్థులు భువనేశ్వరిపై తమ అభిమానాన్ని గొప్పగా చాటుకున్నారు.
శివరాత్రి సందర్భంగా వేలాది మంది తరలివచ్చిన కోటప్పకొండ తిరునాళ్ల ప్రభ దగ్గర భువనేశ్వరి నిలువెత్తు ఫ్లెక్సీని వారు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నార్తుల ఆకలిదప్పులు తీరుస్తున్న ‘భువనమ్మా.. నీకు సాటి ఎవరమ్మా..’ అంటూ భువనేశ్వరి ఫ్లెక్సీ…ఆ తిరుణాళ్లకే హైలైట్ గా నిలిచింది. చంద్రబాబు, భువనేశ్వరిల ఫొటోలతో ఏర్పాటైన ఆ ఫ్లెక్సీ…సోషల్ మీడియాలో వైరల్ అయింది.