ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగబోతోందని జగన్ ప్రకటించారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, సీట్ల వ్యవహారంలో ఇరు పార్టీల అధినేతలు చర్చలు జరుపుతున్నారని, సీట్ల సంఖ్య పై స్పష్టత రాగానే పొత్తుపై అధికారికంగా ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపద్యంలోనే టిడిపితో జనసేన పొత్తుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలో టిడిపితో సీట్ల సర్దుబాటు వ్యవహారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చూసుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీని ఓడించడం తప్ప మరో మార్గం లేదని నాదెండ్ల స్పష్టం చేశారు.
ఇక, తాను తెనాలి శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని నాదెండ్ల మనోహర్ క్లారిటీనిచ్చారు. రాష్ట్రంలో లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పే రోజు వస్తుందని నాదెండ్ల వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను, వారి త్యాగాలను వైసీపీ ప్రభుత్వం అవమానిస్తోందని నాదెండ్ల మండిపడ్డారు.
జూన్ 14 నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని, అన్నవరం క్షేత్రంలో పూజలు చేసిన తర్వాత యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. అయితే, వారాహి యాత్రకు టిడిపితో పొత్తులకు ఎటువంటి సంబంధం లేదని నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైందని, మొత్తం పది నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల వెల్లడించారు.