టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న మలిచిన ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ట్రెండింగ్ లో ఉంది. ఇక, జనవరి 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే చిత్రానికి సంబంధించిన అప్డేట్లను ఒక్కొక్కటిగా జక్కన్న తన మార్క్ తో ప్రమోట్ చేయడం మొదలుబెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
“నాటు నాటు…నాటు నాటు…ఊర నాటు…వీర నాటు అంటూ సాగిన ఈ ప్రోమో సాంగ్ లో తారక్, చెర్రీ వింటేజ్ స్టైల్లో వేసిన స్టెప్పులు వేసి అదరగొట్టారు. మొత్తం నాలుగు భాషల్లో విడుదలైన ఈ ప్రోమో సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకు పూర్తి సాంగ్ విడుదల కానుంది. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా.
ఇక, ఈ పీరియాడిక్ డ్రామా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. మరోవైపు, ఈ సినిమా నుంచి జక్కన్న ఓ ప్రత్యేక డైలాగ్‌ను లీక్ చేశాడు. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి….అది ధర్మ యుద్ధం అయితే విజయం తథ్యం” అంటూ రాజమౌళి లీక్ చేసిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.