భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బ్రతికి బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి శౌర్య చక్ర గ్రహీత, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాద ఘటనపై లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన కూడా చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.08 గంటలకు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని, ఊటీ సమీపంలోని కన్నూర్ లో ప్రమాదం జరిగిన స్థలంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లారని తెలిపారు. అయితే, అప్పటికే హెలికాప్టర్ మంటల్లో కాలిపోతూ కనపడిందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనపై స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రమాద వీడియోను తాను అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా చూశానని, అది సిరియన్ వైమానిక దళానికి చెందినదని, బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రావత్, ఆయన భార్య, ఇతర అధికారులు ఎలా మరణించారన్న దానిపై అనుమానాలున్నాయని అన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రావత్ హెలికాప్టర్ కూలిపోయిందన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇది దేశ భద్రతకే పెద్ద హెచ్చరిక అని అన్నారు. ఈ ఘటనపై తుది నివేదిక రావాల్సి ఉందని… అప్పటి వరకు ఏం చెప్పాలన్నా కష్టమేనన్నారు. తమిళనాడు వంటి ఒక సురక్షిత ప్రాంతంలో హెలికాప్టర్ పేలిపోవడం అనుమానాస్పదమని, దీనిపై కట్టుదిట్టమైన దర్యాప్తు జరగాలని అన్నారు.