సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామకృష్ణరాజు చికిత్స పొందుతూ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్య రీత్యా బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా….సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సాయంత్రంలోగా ఆయన విడుదల అవుతారని అంతా భావించారు.
రఘురామ తరఫు న్యాయవాదులు ఇప్పటికే గుంటూరు జిల్లా కోర్టుకు చేరుకొని వ్యక్తిగత పూచీకత్తు, మిగతి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. మెజిస్ట్రేట్ రిలీజ్ ఆర్డర్ తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా రఘురామ విడుదల అవుతారని అంతా భావించారు. అయితే, తాజాగా రఘురామకృష్ణరాజు విడుదల ప్రక్రియ ఆలస్యం కానుంది.
ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితి గురించి మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమ్మరీని మేజిస్ట్రేట్ కోరగా…రఘురామకు మరో 4 రోజులు వైద్యం అవసరమని వైద్యులు తెలిపారని తెలుస్తోంది. దీంతో 4 రోజుల తర్వాత వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తర్వాతే రఘురామ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో, రఘురామ బెయిల్ పై విడుదల కావడానికి మరో 4-5 రోజులు పట్టే అవకాశముందని తెలుస్తోంది.
అయితే, రఘురామ తరపు న్యాయవాదులు, ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రిలీజ్ ఆర్డర్స్ వచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో ఉండాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామకృష్ణరాజును ఆయన తనయుడు భరత్ పరామర్శించారు. ఆయనతో పాటు రఘురామ న్యాయవాది కూడా ఆసుపత్రికి వెళ్లారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఆర్మీ డాక్టర్లతో భరత్ మాట్లాడారు.